చెత్త పోగేసి.. నిప్పు రాజేసి..!

ప్రజాశక్తి – ఆచంట, పెనుమంట్ర

పల్లెలను సంపూర్ణ పారిశుధ్య గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కోట్ల రూపాయలు వెచ్చించినా చెత్తను సేకరించడంలో అధికారులకు చిత్తశుద్ధి కరువవుతోంది. గతంలో ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ నిధులతో ఆచంట, పెనుమంట్ర, పెనుగొండ, పోడూరు మండలాల్లో చెత్త నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో వానపాములు పెంచేందుకు అణువుగా సిమెంటు తొట్టెలు సైతం ఏర్పాటు చేశారు. షెడ్‌ నిర్మాణం అనంతరం ఎరువులు తయారీ బాధ్యతలు ఎవరు చేపట్టాలో స్పష్టత లేక అటు మండల పరిషత్‌, ఇటు పంచాయతీ అధికారులు చేతులు దులుపుకున్నారు. దీంతో నిర్మించిన షెడ్లు నిరుపయోగంగా మిగిలాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం వృథాగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంపూర్ణ పారిశుధ్యం, స్వచ్ఛ భారత్‌ నినాదాలు ప్రచార ఆర్భాటాలు తప్ప అంతగా ఫలితాలు కనిపించడం లేదు. ప్రజల్లో కాస్తో కూస్తో అవగాహన కలిగి పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే సమయంలో అధికారులు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలను విస్మరిస్తున్నారు.అరకొర చెత్త సేకరణ..నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ చెత్తా చెదారాల సేకరణ అంతంతమాత్రంగానే సాగుతోంది. సిబ్బంది కొరత అధికారుల అలక్ష్యం వెరసి నిత్యం పూర్తిస్థాయిలో పారిశుధ్య కార్యక్రమాలు అమలు కావడం లేదు. దీనిపై తగిన పర్యవేక్షణ లేక నానాటికీ తీవ్రతరం అవుతోంది.డంపింగ్‌ యార్డుల కరువు..గ్రామాల్లో చెత్త వేసేందుకు అవసరమైన డంపింగ్‌ యార్డులు లేకపోవడంతో స్థానిక అధికారులు, సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. గ్రామాల్లో డంపింగ్‌ యార్డుల కోసం స్థలాలు సేకరించాలని ప్రభుత్వాలు పదేళ్లుగా ఆదేశిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మండల స్థాయిలోనే ఒక ప్రధాన డంపింగ్‌ యార్డు ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో పెనుమంట్ర మండలంలో దాదాపు రూ.6 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన చెత్త సేకరణ శుద్ధి కార్యక్రమ ప్రాజెక్టును ఇంకా వినియోగంలోకి తీసుకురాలేదు.రహదారుల పక్కనే చెత్త కుంపటి..గ్రామాల్లో చెత్త పోగు చేయడానికి ప్రత్యేక స్థలాల్లేక పంచాయతీ అధికారులు ప్రధాన రహదారిని డంపింగ్‌ యార్డుగా మార్చేస్తున్నారు. గ్రామాల్లోని చెత్తనంతా రహదారుల మార్జిన్లోకి తరలిస్తున్నారు. దీంతో ప్రతి గ్రామం ప్రవేశంలోనూ, ముగింపు సరిహద్దుల్లోనూ చెత్త దుర్గంధంతో ముక్కుపుటాలు అదురుతున్నాయి. చెత్త మరీ ఎక్కువైనప్పుడు నిప్పు రాజేసి కాల్చేస్తున్నారు. దీంతో దుర్వాసన, పొగతో ఆ దారి గుండా వెళ్లే ప్రయాణికులు కంటి, ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మార్టేరు – ఆచంట, మార్టేరు – తాడేపల్లిగూడెం, బ్రాహ్మణచెరువు-వీరవాసరం, తణుకు – నత్తారామేశ్వరం తదితర ప్రధాన రహదారుల పక్కనే నేడు ఇటువంటి దుస్థితి నెలకొంది.పేరుకుపోతున్న చెత్త..షెడ్డు నిర్మించిన ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర పంచాయతీల్లో సుమారు 65 వేల మంది జనాభా ఉన్నారు. నిత్యం పంచాయతీ కార్మికులు సుమారు రెండు టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఆయా పంచాయతీల్లో డంపింగ్‌ యార్డులకు స్థలాల కొరత కారణంగా రోడ్లు, కాలువ గట్ల వెంబడి చెత్త వేసేస్తున్నారు. దీంతో పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి చెత్త నిర్మూలనకు చిత్త శుద్ధితో కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.

➡️