సమాజంలో రుగ్మతలు పోవాలంటే విద్యే మార్గం

ప్రజాశక్తి – నరసాపురం

సమాజంలో రుగ్మతలు పోవాలంటే చదువు ఒక్కటే ఏకైక మార్గమని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. పట్టణంలోని వైఎన్‌ కళాశాల ప్రారంభించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పురంధేశ్వరి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. కళాశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలను ప్రారంభించి, సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన కళాశాల యజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. మంచి సంకల్పంతో యర్రమిల్లి నారాయణమూర్తి ఈ కళాశాలను స్థాపించారని కొనియాడారు. కళాశాల అభివృద్ధిలో కార్యదర్శి చినమిల్లి సత్యనారాయణ చేసిన కృషి అడుగడుగునా కనబడుతోందన్నారు. విద్య అంటే పాఠ్యపుస్తకాలు, తరగతి గదులు రాంకులు మాత్రమే కాదన్నారు. చదువు అంటే సర్టిఫికెట్స్‌, మెడల్స్‌, ర్యాంకులకు పరిమితం కాకుండా సంస్కృతీ సంప్రదాయాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం యజమాన్యం పురంధేశ్వరిని ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందించారు. జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు కళాశాల ఆవరణలోని స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల అభివృద్ధిలో చినమిల్లి సత్యనారాయణ రావు కృషిని ఏ భవనాన్ని, చెట్టును అడిగినా చెబుతుందని తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఉపాధ్యక్షులు పొన్నపల్లి శ్రీరామారావు మాట్లాడుతూ 1983లో డాక్టర్‌ చినమిల్లి సత్యనారాయణ రావు సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ గా భాధ్యతలు స్వీకరించిన తరువాత కళాశాల రూపు రేఖలు మారాయన్నారు. చినమిల్లి సత్యనారాయణరావు మాట్లాడారు. యర్రమిల్లి నారాయణ మూర్తి కృషితో ఈ కళాశాల ప్రాంభమైందని, కళాశాలకు 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడానికి అప్పటి లా మినిష్టర్‌ గ్రంధి వెంకటరెడ్డి నాయుడు ఎంతో కృషి చేశారని తెలిపారు. వైఎన్‌ కళాశాలలో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన ఎన్నో సౌకర్యాలు ఉన్నాయన్నారు. ప్రముఖ గజల్‌ కళాకారుడు గజల్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ కళాశాల ఎంతో సంస్కారం నేర్పిందని తెలిపారు. కళాశాల పూర్వ విద్యార్ధి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మైనారిటీ వ్యవహారాలు) ఎంఎ షరీఫ్‌ మాట్లాడుతూ ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని , భవిష్యత్‌ను ఈ కళాశాల అందించినదన్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ గ్రంధి భవానీ ప్రసాద్‌, ఎంఎల్‌ఎ బొమ్మిడి నాయకర్‌ మాట్లాడుతూ ఈ కళాశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. మాజీ శాసన సభ్యులు కొత్తపల్లి జానకిరామ్‌ మాట్లాడారు. కార్యక్రమంలో కళాశాల ఎక్స్‌ అఫిషియో ఛైర్మన్‌, ఆర్‌డిఒ దాసి రాజు, కళాశాల కోశాధికారి పోలిశెట్టి శ్రీరఘురామారావు, మాజీ ఉపాధ్యక్షులు జివికె.రామారావు, ప్రిన్సిపల్‌ చింతపల్లి కనకారావు, పీజీ డైరెక్టర్‌ ఎన్‌.చింతారావు పాల్గొన్నారు.

➡️