నిరు(ఉ)ద్యోగులఓ(ఎ)టు..!

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఎంఎల్‌సి ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార టిడిపి ఎంఎల్‌సి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. నియోజకవర్గాలవారీగా ఎంఎల్‌ఎలు, ఎన్నికల పరిశీలకులు సమావేశాలు ఏర్పాటు చేసి కూటమి నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నారు. గ్రాడ్యూయేట్‌ ఎంఎల్‌సి ఎన్నికల్లో కీలక ఓటర్లుగా ఉన్న నిరుద్యోగులు, ఉద్యోగులు కూటమి సర్కార్‌ ఆశలకు గండికొట్టే పరిస్థితి ఉందనే భయం ఆ పార్టీ నాయకులను వెంటాడుతోంది. 2024 మేలో జరిగిన ఎన్నికల్లో టిడిపి కూటమి మేనిఫెస్టోలో తొలి హామీ నిరుద్యోగులకు రూ.మూడు వేలు భృతి అందించడం. కూటమి సర్కార్‌ అధికారంలోకొచ్చి ఎనిమిది నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకూ నిరుద్యోగ భృతికి సంబంధించి నోరు మెదపలేదు. 2014-19 ఎన్నికల్లో రూ.రెండు వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన టిడిపి ఎన్నికలకు ఆరు నెలల ముందు అమల్లోకి తెచ్చి కొద్దిమందికి మాత్రమే ఇచ్చి మమ అనిపించింది. ఇప్పుడు కూడా అదే తరహాలో పాలన ముగిసే సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తుందా అనే అనుమానం నిరుద్యోగుల్లో నెలకొంది. దీంతో గ్రాడ్యుయేట్‌ ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటు ఎటువైపు వేయాలని నిరుద్యోగులు ఆలోచనలో పడ్డారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎంఎల్‌సి ఎన్నికల్లో మొత్తం 3,15,261 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో లక్ష మందికిపైగా నిరుద్యోగులు ఉన్నట్లు అంచనా. నిరుద్యోగులు పెద్దసంఖ్యలో ఉండటంతో గ్రాడ్యుయేట్‌ ఎంఎల్‌సి ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.ఓటెలా అడుగుతారు..? నిరుద్యోగ భృతి అమలు చేయకుండా, ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయకుండా టిడిపి నాయకులు ఓటు ఎలా అడుగుతారు అనే చర్చ క్షేత్రస్థాయిలో నడుస్తోంది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు కూటమి తమ శక్తియుక్తులను మొత్తం ప్రదర్శిస్తోంది. నియోజకవర్గాలవారీగా ఓటర్ల జాబితాలు తీసి ఎంఎల్‌ఎలకు బాధ్యతలు అప్పగిస్తోంది. ఎంఎల్‌ఎల అనుచరగణం ఓటర్లకు ఫోన్లు చేసి ఓటు టిడిపి అభ్యర్థికి వేయాలని కోరుతున్నారు. ఇప్పుడు ఓటు వేస్తే నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం తీవ్ర అలసత్వం వహించే అవకాశం ఉందని, ఓటేయకపోతే యువతలో వ్యతిరేకత వచ్చిందనే అభిప్రాయంతో ప్రభుత్వం హామీలు అమలు చేస్తుందనే చర్చ సాగుతోంది. అంతేకాకుండా గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో ఉద్యోగులు పెద్దసంఖ్యలో ఓటర్లుగా ఉన్నారు. ఇప్పటి వరకూ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఒక్క హామీనీ అమలు చేయలేదు. డిఎలు ఇవ్వడంగాని, సిపిఎస్‌పై నోరు మెదపడంగాని, పిఆర్‌సి కమిటీ ఏర్పాటుపైగాని ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు ఎటువంటి భరోసా దక్కలేదు. దీంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. గ్రాడ్యుయేట్‌ ఎన్నికలపై ఈ ప్రభావం పెద్దఎత్తున పడే అవకాశం కన్పిస్తోంది. నిరుద్యోగులు, ఉద్యోగుల ఓట్లుపై టిడిపి లోలోన ఆందోళన చెందుతున్నప్పటికీ బయటికి మాత్రం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. టిడిపి, పిడిఎఫ్‌ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎంఎల్‌సి ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌, పిడిఎఫ్‌ అభ్యర్థి డివి.రాఘవుల మధ్యే ప్రధాన పోటీ కొనసాగనుందని తెలుస్తోంది. టిడిపి తన అధికార బలంతో గ్రాడ్యుయేట్‌ ఎంఎల్‌సి స్థానాన్ని గెలుచుకోవాలని విశ్వప్రయత్నం చేస్తోంది. పిడిఎఫ్‌కు ఉద్యోగులు, నిరుద్యోగుల్లో పెద్దఎత్తున బలం ఉంది. ఇటీవల జరిగిన తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపా ధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికల్లో పిడిఎఫ్‌ అభ్యర్థి గోపీమూర్తి తొలి ఓటుతోనే భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందే. 2019 మార్చిలో జరిగిన ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎంఎల్‌సి ఎన్నికల్లో పిడిఎఫ్‌ అభ్యర్థి ఇళ్ల వెంకటేశ్వరరావు భారీ మెజార్టీతో గెలిచారు. నిరుద్యోగులు, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై అధికార పార్టీ ఎంఎల్‌సిలు శాసనమండలిలో మాట్లాడే పరిస్థితి ఎప్పుడూ కనిపించదు. పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలు నిరంతరం ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడటం, వారు చేస్తున్న ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొనడం సైతం జరుగుతోంది. దీంతో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటర్లు ఎక్కువగా పిడిఎఫ్‌ అభ్యర్థులకే ఓటు వేయడం జరుగు తోంది. ఈ ఎన్నికల్లోనూ పిడిఎఫ్‌ అభ్యర్థి గట్టి పోటీలో ఉన్న పరిస్థితి నెలకొంది. గెలుపెవరిదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే

.

➡️