ఉపాధి కూలీలకు డబ్బులు సకాలంలో అందించాలి

వ్యకాస, రైతు సంఘం జిల్లా నాయకులు

ప్రజాశక్తి – పెంటపాడు

ఉపాధి కూలీలకు ప్రభుత్వం ప్రకటించిన కూలీ డబ్బులు రాకపోవడం దారుణమని వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం జిల్లా నాయకులు కండెల్లి సోమరాజు, చిల్ల పుల్లారెడ్డి అన్నారు. మండలంలోని ఆకు తీగ పాడులో ఉపాధి కూలీ డబ్బులు ప్రభుత్వం నిర్దేశించిన రూ.300 కూడా రావడం లేదని ఉపాధి కూలీలు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి పర్యటనలో భాగంగా ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు ఆకు తీగపాడు ఉపాధి కూలీలను సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకొనగా ప్రభుత్వం నిర్దేశించిన వేతనం రూ.300 కూడా రావడం లేదని వారు చెప్పారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం జిల్లా నాయకులు కండెల్లి సోమరాజు, చిల్ల పుల్లారెడ్డి మాట్లాడుతూ కూలీ డబ్బులు సకాలంలో పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కొండేటి రమణ, పింకీ సుధారాణి, కొండేటి మేరీ గ్రేట్‌, పింకీ చిన్నారావు, పొలమాటి బాబ్జి, కటిక దేవుడు పాల్గొన్నారు.పెనుగొండ: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు వేతనాలు పెంచుతూ రోజుకు రూ.300 చెల్లిస్తామని చెప్పిన విషయం ఆచరణలో అమలు కావడం లేదని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి షేక్‌ పాదుషా అన్నారు. శనివారం పెనుగొండ, మునమర్రు రోడ్డులో జరుగుతున్న పనులను వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రూ.300 కూలీ రేట్లు తప్పనిసరిగా అమలు చేయాలని, చేసిన పనికి రూ.260 నుంచి రూ.270 వరకు మాత్రమే చెల్లింపులు జరుగుతున్నాయని, పెంచిన వేతనాలు రూ.300 చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పంట బోదెలలో పనిచేసే సమయంలో సీసా పెంకులు, ఎండిపోయిన కొబ్బరి పుల్లలు గుచ్చుకుని బాధలు పడుతున్నామని వారు తెలిపారన్నారు. పని ప్రదేశంలో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పనులను అధికారులు సందర్శించి కూలీల బాధలు తెలుసుకోవాలని డిమాండ్‌ చేశారు. క్షేత్ర స్థాయి సిబ్బంది ఇచ్చిన పనులు కొలత ప్రకారం చేస్తున్నా వేతనాలు సక్రమంగా చెల్లించడంలో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని కోరారు. పనులు ఇచ్చే విషయంలో కార్మికులను ఇబ్బంది పెట్టే సీనియర్‌ మెట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లపై అధికారులు తనిఖీలు నిర్వహించాలని ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

➡️