పెద్దపెద్ద గోతులతో వాహనదారుల అవస్థలు
ప్రజాశక్తి – పెనుమంట్ర
తరచుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండలంలోని ప్రధాన మార్టేరు సెంటర్ నుంచి నాలుగు వైపులా ఉన్న రోడ్లు అనేక చోట్ల గోతులుపడి అధ్వానంగా మారాయి. ముఖ్యంగా పాలకొల్లు వైపు వెళ్లే కెనాల్ రోడ్డు, ఆచంట వైపు వెళ్లే కోడేరు రోడ్డు పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఈ రోడ్లు వాహనదారులను భయపెడుతున్నాయి. అలాగే మార్టేరు – ఆచంట రోడ్డులో నెగ్గిపూడి శివారు శ్మశానం వద్ద రోడ్డు గోతులు పడి ప్రమాద భరితంగా మారింది. మార్టేరు – గూడెం రోడ్డు వంతెన దిగువ పరిస్థితి అలాగే ఉంది. పెనుగొండ వైపు వనువులమ్మ గుడి వద్ద పెద్ద గోతులను స్థానికులు పూడ్చినా, వర్షానికి మట్టి కొట్టుకు పోయి ప్రమాదకరంగా మారాయి. గూడెం రోడ్డులో కోమటి చెర్వు, ఆలమూరు మడుగు ప్రాంతంలో రోడ్డు బాగా పాడైంది. సంబంధించిన అధికారులు తగు చర్యలు తీసుకొని రోడ్ల పరిస్థితి మార్చాలని పలువురు కోరుతున్నారు.