అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

స్వీప్‌ జిల్లా సమన్వయకర్త ప్రభాకరరావు
వివి.గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహనా సదస్సు
ప్రజాశక్తి – ఆకివీడు
ఎన్నికలంటే పౌరులకు ఒక పండగ వంటిదని, మన ఇంట్లో పండగకు మనల్ని ఎవరూ పిలవరని, అదే రకంగా ఎన్నికల పండుగకు కూడా ఎవరికి వారే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు రావాలని స్వీప్‌ జిల్లా సమన్వయకర్త ప్రభాకరరావు అన్నారు. స్వీప్‌ ఆధ్వర్యంలో దుంపగడప వివి.గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు బుధవారం ఓటుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.సుజాత అధ్యక్షతన నిర్వహించిన సభలో ప్రభాకరరావు మాట్లాడుతూ ఓటర్లు కచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్యానికి అవసరమన్నారు. అందుకోసం యువత నడుం బిగించాలన్నారను. వారు ఓటు వేయడమే కాకుండా కుటుంబీకులను, తల్లిదండ్రులను కూడా ప్రోత్సహించాలన్నారు. ఓటుకు తీసుకునే డబ్బు సంవత్సరంలో తాగే టీ ఖరీదు ఉండటం లేదని గుర్తుంచుకోవాలన్నారు. ఓటు వేసే వారి సంఖ్య ఇంకా పెరగాల్సి ఉందన్నారు. ఇప్పటికే 82 శాతం పోలవుతోందని, మరొక పది శాతం కలవాల్సి ఉందన్నారు. అందుకు విద్యార్థులు స్పందించాలన్నారు. ఆకివీడు నగర పంచాయతీ కమిషనర్‌ కె.కృష్ణమోహన్‌ మాట్లాడుతూ ఓటరు తను వేసే ఓటు ఎవరికి పడిందో కూడా చూసుకోవచన్నారు. డిజిటల్‌ ఓట్లన్నీ ఒకరికే పడతాయన్న వాదన సరికాదన్నారు. కళాశాల ప్రిన్సిపల్‌ సుజాత మాట్లాడుతూ నేటి విద్యార్థులు రేపటి విధాతలన్నారు. ఈ కార్యక్రమంలో స్వీప్‌ సభ్యులు ఎస్‌.శ్రీనివాసరావు, శ్రీ చరణ్‌, కళాశాల జాతీయ విభాగం అధికారి ఆనంద్‌కుమార్‌ పాల్గొన్నారు.

➡️