ఆకివీడు: మండలంలోని బొంగులూరు గ్రామ మాజీ సర్పంచి కోపెల్ల రత్నమాణిక్యం(50) సోమవారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందారు. హైదరాబాదులో తన కుమార్తె ఇంటికి వెళ్లిన ఆమె ఆకస్మికంగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. మంగళవారం అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించారు. ఆమె సర్పంచిగా ఉన్న కాలంలో గ్రామం రక్షిత మంచినీటి సరఫరా పథకం ద్వారా ప్రత్యేకంగా అదనపు ఫిల్టర్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేసి మంచినీటి డబ్బాల(క్యాన్లు) ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు అందించే పథకం ప్రారంభించారు. వీటితోపాటు గ్రామంలో పలు ప్రజా రంజకమైన కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డునందుకున్నారు. రత్న మాణిక్యం మృత దేహాన్ని సందర్శించి ఎంఎల్‌ఎ కనుమూరి రఘురామకృష్ణంరాజు, టిడిపి మండల అధ్యక్షులు మోటిపల్లి ప్రసాద్, జనసేన నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు, పిల్ల నరసింహ రావు నివాళులర్పించారు.
