రహదారి పనులకు శంకుస్థాపన

నరసాపురం: గ్రామాలాభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్‌, నరసాపురం ఎంఎల్‌ఎ బొమ్మిడి నాయకర్‌ తెలిపారు. శనివారం మండలంలోని చామకూరిపాలెం గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. సర్పంచి బొక్కా రామస్వామి, బందెల రవీంద్ర పాల్గొన్నారు.

ఛాంబర్స్‌ విద్యార్థుల ప్రభంజనం

పాలకొల్లు : ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన 5వ సెమిస్టర్‌ ఫలితాల్లో ఛాంబర్స్‌ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు 88 శాతం ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ డి.వెంకటేశ్వరరావు తెలిపారు. నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో 88 శాతం ఉత్తీర్ణత సాధించిన కళాశాలలు అతి తక్కువ అని, ఉత్తమ ఫలితాల సాధనలో ఛాంబర్స్‌ కళాశాల మొదట ఉంటుందని అన్నారు. ఈవిధంగా 9.0 నుంచి 9.9 మధ్యలో గ్రేడ్‌ పాయింట్స్‌ సాధించిన విద్యార్థులు 38 మంది అని తెలిపారు.

ప్లాస్టిక్‌ను అరికట్టాల్సిన బాధ్యత అందరిదీ

భీమవరం టౌన్‌ : మనమంతా ఆరోగ్యంగా ఉంటే సమాజం అభివృద్ధి పదంగా ఉంటుందని, ప్లాస్టిక్‌తో ప్రాణాంతకంగా ఉందని భీమవరం ఎండిఒ ఎన్‌.మురళీ గంగాధరరావు అన్నారు. శనివారం భీమవరం పురపాలక సంఘం, శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఎండిఒ, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎండిఒ గంగాధరరావు మాట్లాడుతూ ప్లాస్టిక్‌ నిషేధానికి ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. అనంతరం గుడ్డ సంచులను పంపిణీ చేశారు.

సిఎం సహాయనిధి అందజేత

భీమవరం టౌన్‌: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవ ధర్మమని, సిఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదవారికి అండగా నిలుస్తుందని రాష్ట్ర పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌, ఎంఎల్‌ఎ పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) అన్నారు. శనివారం ఎంఎల్‌ఎ క్యాంప్‌ కార్యాలయంలో 44 మంది లబ్ధిదారులకు రూ.31,04,225 చెక్కులను ఎంఎల్‌ఎ అంజిబాబు చేతుల మీదుగా అందించారు.

పోడూరు : ఆచంట నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన 20 మంది బాధితులకు ఎంఎల్‌ఎ పితాని సత్యనారాయణ రూ.17 లక్షల, 42 వేల 747 విలువ గల చెక్కులు శనివారం రాత్రి బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుత్తుల లోకేశ్వరరావు, జవ్వాది బాలాజీ, ఏడిద శ్రీను, గూడూరి మురళీ, టిఎన్‌వి.రెడ్డి పాల్గొన్నారు.

➡️