ఉచితమే.. అధరహో..!

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

ఇసుక ఉచితమే.. ధర అధరహో అన్నట్లు ప్రభుత్వం తెచ్చిన ఇసుక పాలసీ విధానం ఉండడంతో జనాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతానికి ఇప్పటికీ ధరలో పెద్దగా తేడా లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతో ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక విధానం జనాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక ఇస్తామంటూ టిడిపి కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చింది. జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా జిల్లా కమిటీలను సైతం నియమించింది. ప్రస్తుతం స్టాక్‌పాయింట్లలో ఉన్న ఇసుకను ఉచితంగా అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో అమల్లోకి వచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని పరిశీలిస్తే ప్రజలకు పెద్దగా ప్రయోజనంలేని విధంగా ఉందన్న చర్చ నడుస్తోంది. ఏలూరు జిల్లాలో ఓపెన్‌ ఇసుక రీచ్‌లో లేవు. దీంతో ఉంగుటూరు మండలం చేబ్రోలు, కుక్కునూరు మండలం వింజరం, ఇబ్రహీంపేటలో ఉన్న మూడు స్టాక్‌ పాయింట్ల నుంచి ఇసుక సరఫరా చేయాలని జిల్లా కమిటీ నిర్ణయించింది. చేబ్రోలు స్టాక్‌ పాయింట్‌లో పెద్దగా ఇసుక నిల్వలు లేవని తేలిపోయింది. ఉన్న ఇసుక సైతం నాణ్యత లేనిదిగా ఉంది. వింజరంలో ఇసుక డిపో వద్ద 1500 టన్నులు, ఇబ్రహీంపేట డిపో వద్ద 75 వేల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని తేల్చారు. ఈ పాయింట్ల నుంచి ఇసుక సరఫరాకు సంబంధించి ధరలను కమిటీ నిర్ణయించింది. ఎగుమతి ఖర్చు, ఇసుక డిపోకు చేరవేత వంటి ఖర్చుల ఆధారంగా ఈ ధర నిర్ణయించినట్లు చెబుతున్నారు. చేబ్రోలు స్టాక్‌ పాయింట్‌ వద్ద టన్ను ఇసుక ధర రూ.538గా, వింజరం స్టాక్‌పాయింట్‌ వద్ద రూ.362, ఇబ్రహీంపేట స్టాక్‌ పాయింట్‌ వద్ద టన్ను ఇసుక రూ.210 ధర నిర్ణయించి బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ఇసుక సరఫరా చేయబడునని బోర్డులపై పేర్కొన్నారు. ఒక్క రోజులో ఒక వ్యక్తికి 20 టన్నుల ఇసుక మాత్రమే తీసుకోవడానికి అనుమతి అని నిబంధనలు విధించారు. ఇసుక టన్నుకు నిర్ణయించిన ధరలు చూసి జనం విస్తుపోతున్న పరిస్థితి నెలకొంది. చేబ్రోలు డిపో నుంచి గతంలో టన్ను ఇసుక ధర రూ.750 వసూలు చేసేశారు. రవాణా ఛార్జీలతో కలుపుకుంటే 20 టన్నులు కలిగిన ఆరు యూనిట్ల లారీ ఇసుక ధర రూ.18 వేల వరకూ ఉండేది. ఇప్పుడు రూ.538 ధర నిర్ణయించడంతో రవాణా ఛార్జీలతో కలిపి రూ.15 వేలకు పైగా ఖర్చవుతోంది. ఉచిత ఇసుక అని చెబుతున్నా ధరలో పెద్దగా తేడా కనిపించడం లేదు. వింజరం, ఇబ్రహీంపేట డిపోల వద్ద టన్ను ఇసుక ధర తక్కువగా ఉన్నప్పటికీ అక్కడ నుంచి ఏలూరు జిల్లాలో ఏ గ్రామానికి తీసుకెళ్లాలన్న వంద కిలోమీటర్లకుపైగా దూరం ఉంది. దీంతో రవాణా ఛార్జీలు తడిసి మోపెడవనున్నాయి. ఉచిత ఇసుక విధానం అని చెబుతున్నప్పటికీ భారీగా సొమ్ములు చెల్లించాల్సి రావడంతో జనం పెదవి విరుస్తున్నారు. ముందు ముందు ధరలు పెంచితే ఉచిత ఇసుక విధానంతో జనానికి పెద్దగా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతోంది.’ పశ్చిమ’లో పరిస్థితి మరింత దారుణంఉచిత ఇసుక విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమలైనా ‘పశ్చిమ’లో మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఈ జిల్లాలోని ఆచంట మండలంలో కోడేరు, కరుగోరుమిల్లి, పెనుగొండ మండలంలో సిద్ధాంతంలో రెండు, నడిపూడిలో రెండు మొత్తం ఆరు ఓపెన్‌ ఇసుక రీచ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఇవన్నీ మూతపడ్డాయి. అనుమతులు వచ్చే వరకూ ఇవి తెరుచుకునే అవకాశం లేదు. నరసాపురం, యలమంచిలిలో ఐదు డి-సిల్టేషన్‌ పాయింట్లు ఉన్నప్పటికీ అవి ప్రస్తుతం పనిచేయడం లేదు. దీంతో జిల్లాలో ఉచిత ఇసుక విధానం ప్రారంభం కాలేదు. భీమవరం, నరసాపురం పట్టణాలకు 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం తూర్పుగోదావరి జిల్లాలో మూడు ఇసుక కేంద్రాలు ఉన్నాయని ఇవి ఐదు మండలాలకు అతి సమీపంలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. నిడదవోలు మండలం పందలపర్రు, పెరవలి మండలంలోని పెండ్యాల, ఉసులుమర్రులో ఇసుక అందుబాటులో ఉందని అక్కడ నుంచి తెచ్చుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. కోనసీమ జిల్లాలో మూడు ఇసుక ర్యాంపులు మరో ఐదు మండలాలకు దగ్గరగా ఉన్నాయని, రావులపాలెం మండలంలో రావులపాడు -1, 2, కొత్తపేట కేంద్రంలోనూ ఇసుక అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లా ప్రజానీకం ఇసుక సరఫరాకు పక్క జిల్లాలపై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయా డిపోల్లో నిర్ణయించిన ధర ప్రకారం కొనుగోలు చేసి రవాణా చేసుకుంటే గతానికీ, ఇప్పటికీ పెద్దగా తేడా ఉండదన్న అభిప్రాయం అక్కడి ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది. దీంతో ఉచిత ఇసుక విధానం జనాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

➡️