భవితవ్యం.. భద్రం..!

ఏలూరు జిల్లాలో 83.65 శాతం, పశ్చిమలో 82.60 శాతం పోలింగ్‌
పలుచోట్ల అర్ధరాత్రి వరకూ సాగిన ఓటింగ్‌
స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేరిన ఇవిఎంలు
ఏలూరు, భీమవరంల్లో మూడంచెల భద్రతతో గట్టి బందోబస్తు
గెలుపోటములపై ఎవరి లెక్కలు వారివే
గతం కంటే పెరిగిన ఓటింగ్‌ శాతం
4న ఓట్ల లెక్కింపు
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్‌రూముల్లోకి చేరింది. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాక జూన్‌ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అప్పటి వరకూ ఇవిఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌రూముల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి తణుకు, పాలకొల్లు, ఆచంట, నరసాపురం నియోజకవర్గాల ఇవిఎంలను భీమవరం విష్ణు కాలేజీలో, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల ఇవిఎంలను భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలోనూ భద్రపర్చారు. ఏలూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ఇవిఎంలను సిఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో భద్రపరిచారు. ఓట్ల లెక్కింపు ఆయా ప్రాంతాల్లోనే జరగనుంది. సోమవారం జరిగిన ఎన్నికల్లో గతంకంటే పోలింగ్‌శాతం పెరిగింది. యువ ఓటర్లు ఈసారి పెద్దఎత్తున ఓటు వేశారు. జిల్లావ్యాప్తంగా పలు పోలింగ్‌ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకూ ఓటింగ్‌ జరిగింది. దీంతో ఇవిఎంలను స్ట్రాంగ్‌రూములకు చేర్చేసరికి తెల్లవారుజాము నాలుగు, ఐదు గంటలు అయ్యింది. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్‌ కేంద్రాలకు చేరిన ప్రతి ఓటరుతోనూ అర్ధరాత్రి అయినా ఓటు వేయించారు. దీంతో ఏలూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో మొత్తంగా 83.65 శాతం పోలింగ్‌ నమోదైంది. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో 83.55 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఈ ఎన్నికల్లో కేవలం 0.10 శాతం ఓటింగ్‌ పెరిగిందని చెప్పొచ్చు. ఉంగుటూరు నియోజకవర్గంలో అత్యధికంగా 87.76 శాతం ఓటింగ్‌ జరగ్గా, అత్యల్పంగా ఏలూరు నియోజకవర్గంలో 70.16 శాతం ఓటింగ్‌ జరిగింది. ఏలూరు నియోజకవర్గం మినహా జిల్లాలోని మిగిలిన ఆరు నియోజకవర్గాల్లోనూ 80 శాతానికిపైగా ఓటింగ్‌ జరగడం విశేషం. పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 14,72,928 మంది ఓటర్లు ఉండగా 12,16,667 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో జిల్లా మొత్తంగా 82.60 శాతం ఓటింగ్‌ నమోదైంది. అత్యధికంగా ఉండిలో 86.20 శాతం ఓటింగ్‌ నమోదవ్వగా, తక్కువగా భీమవరంలో 79.35 శాతం ఓటింగ్‌ నమోదైంది. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో 81.90 శాతం ఓటింగ్‌ నమోదైంది. గత ఎన్నికల ప్రకారం చూస్తే ఓటింగ్‌శాతం 0.70 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి వరకూ ఓపిగ్గా నిలబడి పెద్దఎత్తున ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా జనం తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.గెలుపోటములపై ఎవరి ధీమా వారిదే.. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో గెలుపోటములపై అభ్యర్థులు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. రెండు జిల్లాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్‌ స్థానాల పరిధిలో టిడిపి కూటమి, వైసిపి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ప్రతి నియోజకవర్గంలోనూ నువ్వా నేనా అన్నట్లు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ పడ్డారు. డబ్బు సైతం పోటీ పడి పంచారు. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేలు, బహుమతులు సైతం అందజేశారు. ఓటింగ్‌శాతం పెద్దఎత్తున నమోదవడంతో ఎవరికి లాభం చేకూరుతుందనే లెక్కలు కడుతున్నారు. తమ అభ్యర్థికి ఇంత మెజార్టీ వస్తుందని ఒక పార్టీ, కాదు తమ పార్టీ అభ్యర్థికి మెజార్టీ ఎక్కువ వస్తుందని ఇలా గెలుపోటములపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు రావడానికి మరో 20 రోజుల గడువు ఉండటంతో గెలుపోటములపైనే ప్రధాన చర్చ నడుస్తోంది. గెలుపోటములతోపాటు మెజార్టీపైనా బెట్టింగుల జోరు సాగుతోంది.’పశ్చిమ’లో నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లు ఇలానియోజకవర్గం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు ఓటింగ్‌శాతంఆచంట 1,80,017 1,49,048 82.80పాలకొల్లు 1,95,057 1,60,489 82.28నరసాపురం 1,70,448 1,43,825 84.38భీమవరం 2,53,116 2,00,857 79.35ఉండి 2,24,725 1,93,722 86.20తణుకు 2,34,575 1,92,736 82.16తాడేపల్లిగూడెం 2,14,985 1,75,990 81.86మొత్తం 14,72,923 12,16,667 82.60 ఏడు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు 7,51,313 మంది ఓటర్లుండగా, ఓటువేసిన వారు 6,14,077 మంది, పురుష ఓటర్లు 7,21,532 మందికి ఓటువేసిన వారు 6,02,543 మంది ఉన్నారు.ఏలూరు జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఓటింగ్‌ ఇలానియోజకవర్గం మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు శాతంచింతలపూడి 2,73,069 2,22,608 81.52దెందులూరు 2,24,013 1,92,901 86.11ఏలూరు 2,35,345 1,65,132 70.16కైకలూరు 2,05,604 1,79,536 87.32నూజివీడు 2,38,981 2,10,155 87.94పోలవరం 2,53,981 2,18,366 85.98ఉంగుటూరు 2,06,437 1,81,164 87.76మొత్తం 16,37,430 13,69,862 83.65 ఓటు వేసిన మహిళా ఓటర్లు 6,93,172 మంది, పురుష ఓటర్లు 6,76,639 మంది ఉండగా ఇతరులు 55 మంది ఉన్నారు.

➡️