ప్రజాశక్తి – తణుకు
ప్రభుత్వం ద్వారా సరఫరా అయ్యే నిత్యవసర వస్తువులు వినియోగదారులకు సకాలంలో అందేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం తణుకు పట్టణంలో ఎంఎల్‌ఎస్ పాయింట్(నిత్యవసర వస్తువుల గోడౌన్)ను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్‌లో ఉన్న సరుకును, స్టాఫ్ రిజిస్టర్‌లను తనిఖీ చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్టర్‌లోని నిల్వలకు, భౌతిక నిల్వలకు ప్రతిరోజు లెక్కలు సరి చూసుకోవాలని సూచించారు. ఈనెల 30 లోపు జిల్లాలోని అన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్‌ల నుంచి ఎఫ్‌పి షాపులకు నిత్యవసర సరుకులు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సకాలంలో జీతాలు వస్తున్నాయా అని హమాలీలను ప్రశ్నించగా, జీతాలు వస్తున్నాయని, ఏవిధమైన ఇబ్బందులు లేవని జాయింట్ కలెక్టర్‌కు వారు తెలిపారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ తనిఖీలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ టి.శివరాంప్రసాద్, టెక్నికల్ సహాయ మేనేజర్ ఇబ్రహీం, తణుకు తహశీల్ధారు డివిఎస్‌ఎస్ అశోకవర్మ పాల్గొన్నారు.