పేదలకు అండగా ప్రభుత్వం

ప్రజాశక్తి – పాలకోడేరు

పేద ప్రజలకు, అనారోగ్య పీడితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. శృంగవృక్షం ఫ్రాస్కోగన మెమోరియల్‌ లెప్రసీ రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన సామాజిక పింఛన్లు, పిడిఎస్‌ బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను, రేషన్‌ బియ్యంను కలెక్టర్‌ అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అదే ప్రాంగణంలో నివశిస్తున్న కుష్ఠురోగ బాధితుల కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ నాగరాణి మాట్లాడుతూ ఫ్రాస్కోగన మెమోరియల్‌ లెప్రసీ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ సేవలు అద్వియమైనవన్నారు. కుష్ఠు అంటువ్యాధి కాకపోయినా సమాజం దూరంగా ఉంచుతోందని, ఇటువంటి వారిని చేరదీసి ప్రేమతో అక్కున చేర్చుకుని ఆశ్రయం కల్పించడంతోపాటు, వారి ఆలనా పాలనా చూస్తున్న రిహాబిలిటేషన్‌ సెంటర్‌ నిర్వాహకులు ధన్యులని అన్నారు. ఇటువంటి వ్యాధి పీడితుల పట్ల సమాజం ప్రేమతో మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్రాస్కోగన మెమోరియల్‌ లెప్రసీ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ ఫాదర్‌ గాబ్రియేలు తోట, నిర్వాహకురాలు సిస్టర్‌ లూర్దు మేరీ, అడ్మినిస్ట్రేషన్‌ సిస్టర్‌ బ్రెజిత్‌, డిఆర్‌డిఎ పీడీ ఎంఎస్‌ఎస్‌.వేణుగోపాల్‌, డిఎస్‌ఒ ఎన్‌.సరోజ, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ డి.మహేశ్వరరావు, గ్రామ సర్పంచి జంగం సూరిబాబు, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ భానునాయక్‌, తహశీల్దార్‌ ఎన్‌బి.విజయలక్ష్మి, డిఆర్‌డిఎ ఎపిఒ టి.మురళీకృష్ణ, సివిల్‌ సప్లయీస్‌ డిటి ఎం.రవిశంకర్‌ పాల్గొన్నారు.

➡️