గ్రామ సమస్యల పరిష్కారం దిశగా గ్రామసభ

పెనుగొండ : మేజర్‌ పంచాయతీలో పెనుగొండ సర్పంచి శ్యామల సోని గ్రామసభ నిర్వహించారు. సోమవారం పంచాయతీ ఆవరణలో గ్రామసభకు రావాలని దండోరా వేసినప్పటికీ గ్రామస్తులు సమస్యలు చెప్పడానికి ముందుకు రాలేదు. ఈ సభకు సచివాలయం సిబ్బంది తప్ప ఇంకెవరూ లేరని తూతూ మంత్రంగా గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచి శ్యామల సోనీ మాట్లాడుతూ సచివాలయం సిబ్బంది తమ విధులు నిర్వహించడంలో వైఫల్యం కనిపిస్తుందని, 5 సచివాలయాల్లో సిబ్బంది విధులు నిర్వహించకుండా వచ్చి వెళ్లిపోతున్నారని, సచివాలయం సిబ్బంది, ప్రజా ప్రతినిధులు వచ్చినప్పుడు విధుల్లో లేకపోవడం దారుణమని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుదర్శన్‌ ఉన్నారు.

సిపిఎం నూతన కార్యాలయం ప్రారంభం

వీరవాసరం : నవుడూరు సెంటర్‌లో సిపిఎం తాత్కాలిక నూతన కార్యాలయాన్ని సోమవారం నేషనల్‌ ఫ్లాగ్‌ టవర్‌ సమీపంలో ఏర్పాటు చేశారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం ఆర్‌అండ్‌బి రహదారి ఆక్రమణల తొలగింపు నేపథ్యంతో బస్టాండ్‌ వద్ద ఉన్న ఈ కార్యాలయాన్ని ఆర్‌ అండ్‌ బి ఆధికారుల సూచన మేరకు తొలగించారు. ప్రజా సమస్యల పోరాటం నేపథ్యంతో తమ కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులో ఉండాలన్న నేపథ్యంలో ఇదే మార్గంలో ఏర్పాటు చేశామని సిపిఎం జిల్లా నాయకులు జుత్తిగ నరసింహమూర్తి తెలిపారు. కార్యలయం వద్ద డాక్టర్‌ బిఆర్‌.అబేద్కర్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వేసవి నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.

స్లాబ్‌ నిర్మాణానికి ఆర్థిక సహకారం

పెనుగొండ : మండలంలోని తామరాడ గ్రామంలో భారతరత్న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి సొంత ఖర్చులతో రూ.లక్ష 70 వేలు స్లాబ్‌ నిర్మాణానికి మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అందజేయడంతో తామరాడ గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మాకినీడి కోట సత్యనారాయణ, కుసుమే రాంబాబు, పోతుమూడి రామచంద్రరావు, దంపనబోయిన బాబురావు, పాలపర్తి సుబ్రహ్మణ్యం, తోలేటి శీను, పులిదిండి వెంకటేశ్వరరావు, పీతల వెంకటేశ్వరరావు, సాకా సుబ్రహ్మణ్యం, పలివెల శ్రీను, సంఘ సభ్యులు వి.నరేష్‌, వి.రాధాకృష్ణ, ఎన్‌.శ్రీను, అంబేద్కర్‌ అభిమానులు పాల్గొన్నారు. అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం నరసాపురం: నరసాపురంలో అగ్నిమాపక వారోత్సవాలను సోమవారం అగ్నిమాపక అధికారి కె.భాస్కర్‌ రామం జెండా ఊపి ప్రారంభించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి శ్రద్ధాంజలి ఘంటించారు. అనంతరం కరపత్రాలు, బ్యానర్‌ను ఆవిష్కరించారు. నరసాపురం కేంద్రం అధికారి కె.భాస్కరరామం మాట్లాడుతూ ఈ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వివిధ ప్రదేశాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది, అగ్నిమాపక వాహనంతో పాటు వివిధ అగ్నిమాపక పరికరాలతో స్టాల్స్‌ ఏర్పాటు చేసి, పట్టణంలో ప్రజలకు వివరించి అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలు పంచారు.

➡️