గునుపూడి, తాడేరు మురుగు కాలువను తవ్వాలి

కౌలు రైతు, రైతుసంఘాల ఆధ్వర్యాన రాస్తారోకో

ప్రజాశక్తి – భీమవరం

గునుపూడి, తాడేరు మురుగు కాలువను తక్షణమే తవ్వి, రైతుల నారుమళ్లు, పంట పొలాలను కాపాడాలని ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు డిమాండ్‌ చేశారు. మురుగు కాలువలోని గుర్రపుడెక్క, కిక్కిస, తూడును తక్షణమే తొలగించాలని ఎపి కౌలురైతుల సంఘం, రైతుసంఘం ఆధ్వర్యంలో తాడేరు వంతెన వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ గునుపూడి మురుగు కాలువను ఏళ్ల తరబడి తవ్వకపోవడంతో పూడిపోయిందన్నారు. గుర్రపుడెక్క, కిక్కిస పెద్దఎత్తున పెరిగిపోవడంతో నీరులాగే పరిస్థితి లేదన్నారు. ఈ కాలువపై దాదాపు పదివేల ఎకరాల్లో మురుగునీరు లాగే పరిస్థితి లేదని తెలిపారు. ప్రస్తుతం కొద్దిపాటి వర్షానికే నీరు ప్రవహించకపోవడంతో వందలాది ఎకరాల్లో నారుమళ్లు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కాలువను ఆధునికీకరించాలని డిమాండ్‌ చేశారు. రైతులు కర్రి అచ్యుతరావు, మట్టా ఏసు, పూడి పెద్దిరాజు, పలువురు కౌలురైతులు మాట్లాడుతూ సమస్యను పలుమార్లు డ్రెయినేజీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం నారుమడుల్లో నీరు లాగక పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. కాలువల్లో చెత్తాచెత్తారం తొలగించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలి తప్ప తాత్కాలికంగా రసాయన మందులు పిచికారీ చేయడం ఉపయోగకరం కాదన్నారు. లేనిపక్షంలో క్రాప్‌ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వమే కౌలురైతులు, రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పోతుల అమృతరావు, నల్లం వెంకటేశ్వరరావు, వంగా పుల్లారావు, నల్లం వెంకటేశ్వరరావు, గణేషుల శ్రీనివాస్‌, పివి.భాస్కరరావు, బొబ్బిలి రాము, రాసపల్లి వెంకటేశ్వరరావు, ముచ్చు రంగారావు, సిహెచ్‌.బాలాజీ పాల్గొన్నారు.

➡️