నరసాపురం డిఎస్‌పి డాక్టర్ శ్రీవేద
ఆచంట : శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు నరసాపురం డిఎస్‌పి డాక్టర్ శ్రీవేద అన్నారు. ఆచంట పోలీస్ స్టేషన్‌ను గురువారం నరసాపురం డిఎస్‌పి డాక్టర్ శ్రీవేద ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో పాటు స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. మహిళలు, ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నానంటూ మోసం చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి విషయాలలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. గంజాయి నియంత్రణకు కఠినచర్యలు చేపడతామని, మాదకద్రవ్యాల నియంత్రణకు సంకల్పం కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా అన్ని కళాశాలలు, పాఠశాలలు సందర్శించి మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తామన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చేసేందుకు ముమ్మరంగా దాడులు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆచంట ఎస్‌ఐ బి.వెంకటరమణ పాల్గొన్నారు.