ఫిబ్రవరి నెలాఖరులోపు నూరుశాతం రుణాలివ్వాలి

ప్రజాశక్తి – భీమవరం

ఎస్‌సి, బిసి కార్పొరేషన్ల ద్వారా వివిధ తరగతుల ప్రజలకు అందించే రుణాలను బ్యాంకర్లు నూరు శాతం మంజూరు చేయాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి సూచించారు. బుధవారం స్థానిక కలెక్టర్‌ క్యాంపు కార్యాయలంలో బిసి, ఎస్‌సి కార్పొరేషన్ల ద్వారా వివిధ తరగతులకు మంజూరు చేసే రుణాలపై ఎస్‌సి, బిసి కార్పొరేషన్లు, ఎల్‌డిఎం, డిఆర్‌డిఎ, మెప్మా, పరిశ్రమల శాఖల అధికారులు, వివిధ బ్యాంకర్లతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నాగరాణి మాట్లాడుతూ ఎస్‌సి, బిసిల అభ్యున్నతికి స్వయం ఉపాధి, ఎంఎస్‌ఎంఇ పథకాల కింద వివిధ రకాల సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఎస్‌సి, బిసిల అభ్యున్నతికి ఎస్‌సిలకు 714 యూనిట్లకు రూ.22.38 కోట్లు సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తారన్నారు. సెర్ఫ్‌ ద్వారా 120 ఆటోలను మంజూరు చేస్తారని తెలిపారు. బిసిల స్వయం ఉపాధి పథకాలకు 1,901 మందికి రూ.36.49 కోట్లు, జనరిక్‌ మెడికల్‌ షాపుల ఏర్పాటుకు 39 యూనిట్లకు రూ.3.08 కోట్లు, బిసియేతరులైన వారికి స్వయం ఉపాధి పథకాల కింద 215 మందికి రూ.3.73 కోట్లు, జనరిక్‌ మెడికల్‌ దుకాణాల ఏర్పాటుకు 35 యూనిట్లకు రూ.2.92 కోట్లు సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. వీటితోపాటు కాపు కార్పొరేషన్‌ ఎంఎస్‌ఎంఇ పథకం 694 యూనిట్లను నెలకొల్పేందుకు రూ.13.88 కోట్లు రుణాలు మంజూరు చేస్తారన్నారు. ఎస్‌సిలకు మంజూరు చేసే రుణాల్లో మూడు, నాలుగు చక్రాల ప్యాసింజర్‌ ఆటోలు, నాలుగు చక్రాల గూడ్స్‌ ట్రక్‌, పాడి గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, హోటల్‌ క్యాటరింగ్‌, శారీ పాలిషింగ్‌, రోలింగ్‌, బ్యూటీపార్లర్‌, ఫొటోస్టూడియో, టూరిజం ఫొటోషూట్‌, వెజిటబుల్‌ షాప్‌, సెల్‌ఫోన్‌ రిపేర్‌ షాప్‌, ఫ్యాన్సీ షాప్‌, ఐస్‌క్రీమ్‌ పార్లర్‌, మెటల్‌ బ్రాస్‌ యూనిట్‌, మొబైల్‌ ఫుడ్‌ స్టాల్‌, జ్యూట్‌బ్యాగ్‌ మేకింగ్‌, టెక్స్‌టైల్‌ యూనిట్‌, పవర్‌ టిల్లర్‌, మినీదాల్‌, రైస్‌మిల్‌, ట్రాక్టర్‌ తదితర యూనిట్లు నెలకొల్పుకునేందుకు బ్యాంకు లింకేజీ రుణాలను రూ.10 లక్షల వరకు అందజేస్తారన్నారు. ఆసక్తి గల వారు ఒబిఎంఎంఎస్‌ పోర్టల్‌లో ఈ నెల ఎనిమిది నుంచి 16వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 20 నుండి 24 వరకు మండల, మున్సిపల్‌ అధికారులు బ్యాంకర్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారన్నారు. 26, 27 తేదీల్లో దరఖాస్తుల తిరస్కరణ ఉంటే తెలియజేస్తారని, లక్ష్యానికి అనుగుణంగా అవకాశం ఉంటే కొత్తవారిని చేర్చుతారని తెలిపారు. ఈ నెల 28 నుండి ఫిబ్రవరి 12 వరకు వివిధ దశల్లో అనుమతి పొందిన అనంతరం బ్యాంకులకు డాక్యుమెంట్స్‌ సమర్పిస్తారన్నారు. ఫిబ్రవరి 21 నుండి 26 మధ్య నియోజకవర్గాలవారీ షెడ్యూల్‌ ప్రకారం రుణమేళాలు నిర్వహించి ప్రజాప్రతినిధుల ద్వారా అందజేస్తారన్నారు. సమావేశంలో ఎస్‌సి కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి.విజయ ప్రకాష్‌, బిసి కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పుష్పలత, లీడ్‌బ్యాంకు జిల్లా మేనేజర్‌ ఎ.నాగేంద్రప్రసాద్‌, డిఆర్‌డిఎ పీడీ ఎంఎంఎస్‌.వేణుగోపాల్‌, జిల్లా పరిశ్రమల శాఖాధికారి యు.మంగపతిరావు, మెప్మా అధికారి నాని బాబు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.నిషేధిత భూముల జాబితా పున్ణపరిశీలన నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూములను పున్ణపరిశీలన చేయాలని సిసిఎల్‌ఎ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. అమరావతి నుంచి ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ బుధవారం నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో 57 శాతం పరిశీలన జరిగిందన్నారు. సమావేశంలో ల్యాండ్‌ సెక్షన్స్‌ సూపరింటెండెంట్‌ సిహెచ్‌.రవికుమార్‌, కోఆర్డినేషన్‌ సెక్షన్‌ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ మర్రాపు సన్యాసిరావు పాల్గొన్నారు.

➡️