మున్సిపల్‌ కార్మికుల సంఖ్య పెంచి పని భారం తగ్గించాలి

మున్సిపల్‌ కార్యాలయాల వద్ద ధర్నాల్లో సిఐటియు నేతలు

ప్రజాశక్తి – భీమవరం

భీమవరం మున్సిపాల్టీలో కార్మికుల సంఖ్య పెంచి పని భారం తగ్గించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.వాసుదేవరావు డిమాండ్‌ చేశారు. ఇంజినీరింగ్‌ కార్మికులకు జిఒ 36 అమలు చేసి పనిముట్లు అందించాలన్నారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో భీమవరం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు పూర్తవుతున్నా మున్సిపల్‌ కార్మికులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. భీమవరం మున్సిపాల్టీలో పర్మినెంట్‌ కార్మికుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోందని వారి స్థానంలో కొత్త కార్మికులను నియమించాలని డిమాండ్‌చేశారు. జిల్లా కేంద్రం వల్ల పని భారం మరింత పెరిగిందని, దానికి అనుగుణంగా కార్మికులను పెంచే చర్యలను అధికారులు తీసుకోవడం లేదని విమర్శించారు. డివిజన్లో హెల్త్‌ కిట్స్‌ ఏర్పాటు చేయాలని, ఇప్పటికే కార్మికులు అనారోగ్యాలపాలై ఇబ్బందులు పడుతున్నారు తెలిపారు. యూనియన్‌ అధ్యక్షులు నీలాపు రాజు మాట్లాడుతూ సమ్మె కాలం ఒప్పందాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అన్ని డిపార్ట్మెంట్లో ఖాళీలు సంఖ్య భర్తీ చేయాలన్నారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించలేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. యూనియన్‌ నాయకులు బి.వరలక్ష్మి, నీలాపు రాజు, భాను, మోహన్జ, యరాజు,నాని, ఎన్‌.నాగేశ్వరరావు పాల్గొన్నారు.తణుకు : కూటమి ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ రామ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఇంజినీరింగ్‌, క్లాప్‌ కార్మికులకు రూ.24,500 వేతనం ఇవ్వాలని, చట్టప్రకారం ఉన్న సెలవులు ఇవ్వాలని, క్లాప్‌ డ్రెవర్లు వేతన బకాయిలు వెంటనే ఇవ్వాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్‌ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు. గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో వైసిపి ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఎన్నో ఆశలతో కూటమికి కార్మికులు మద్దత్తు ఇచ్చారని గుర్తు చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని లేకుంటే భవిష్యత్తులో సమ్మెకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ఇంజినీరింగ్‌ సెక్షన్‌ యూనియన్‌ అధ్యక్షులు ఉండ్రాజవరం శ్రీను మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలన్నారు. క్లాప్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ కార్యదర్శి ఎంటివివి గణేష్‌ మాట్లాడుతూ మూడేళ్ల నుంచి చెత్త సేకరణ వాహనాలు నడుపుతున్నామని, తమకు నేటికీ కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. మున్సిపల్‌ యూనియన్‌ కార్యదర్శి ఎన్‌.ఆదినారాయణబాబు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకుంటే పోరాటమే శరణ్యమన్నారు. సిఐటియు జిల్లా నాయకులు అడ్డగర్ల అజయకుమారి, గార రంగారావు, అర్జీ కృష్ణబాబు, మందులయ్య, రాణి, అయ్యప్ప, జి.విజయకుమార్‌, శ్రీదేవి, పడాల దానం, నాగబాబు, తాతారావు, ఆదినారాయణ, కేశవరావు పాల్గొన్నారు.

➡️