సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె

ప్రజాశక్తి – భీమవరం

వ్యవసాయ కోఆపరేటివ్‌ సొసైటీ ఉద్యోగుల దీర్ఘకాల సమస్యలు పరిష్కరించాలని కోఆపరేటివ్‌ ఉద్యోగుల సంఘం నేతలు, ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. కంప్యూటరీకరణ పేరుతో ఎటువంటి శిక్షణా ఇవ్వకుండా ఉద్యోగులను ఒత్తిడికి గురి చేయడం సరైంది కాదన్నారు. గతంలో ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి దశలవారీ ఆందోళన చేయడంతోపాటు ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకు సిద్ధంగా ఉన్నామని జిల్లా సహకార అధికారి, జిల్లా రెవెన్యూ అధికారికి డిమాండ్లతో కూడిన సమ్మె పత్రాలను స్థానిక కలెక్టరేట్లో మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ వద్ద జరిగిన ఉద్యోగుల సమావేశంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షులు పి.విజయభాస్కర్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రారు మాట్లాడారు. వ్యవసాయ పరపతి సొసైటీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయివేటీకరించాలనే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. 2014 నుండి ఉద్యోగులకు వేతన సవరణ చేయలేదని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయగా, ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం సాచివేత వైఖరిని ప్రదర్శిస్తుందని విమర్శించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న డిసిసిబి ఎదుట, 20న జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలకు రాష్ట్ర సంఘం పిలుపునిచ్చిందని, ఉద్యోగులందరూ పెద్దఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల సొసైటీల్లో కంప్యూటరీకరణ పేరుతో ఎటువంటి సౌకర్యాలూ కల్పించకుండా, శిక్షణ ఇవ్వకుండా గత ఆరు నెలల నుండి తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని తెలిపారు. ఆన్‌లైన్‌ పనుల పేరుతో ఉద్యోగులపై పని భారాన్ని పెంచారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. యూనియన్‌ జిల్లా కార్యదర్శి పి.కృష్ణప్రసాద్‌, కోశాధికారి ఇ.పెద్దిరాజు, కన్వీనర్‌ పి.నరసింహరాజు మాట్లాడుతూ కోఆపరేటివ్‌ సొసైటీలను బలోపేతం చేయాలన్నారు. రైతాంగానికి మరింత సేవ చేసేలా ప్రభుత్వ విధానాలు ఉండాలన్నారు. ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే సమ్మెకు ఉద్యోగులందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.కృష్ణంరాజు, జిల్లా నాయకులు ఎన్‌.ఏసుబాబు, రామకృష్ణ సుబ్రహ్మణ్యం, గణపతి, ఎం.శ్రీను, కెఎస్‌.ప్రభు, జి.శ్రీను, ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️