ప్రజాశక్తి కథనానికి స్పందన
ప్రజాశక్తి – నరసాపురం
ఈ నెల 25న ఆ వైద్యులు తీరు.. జనం బేజారు..! శీర్షికన ప్రజాశక్తిలో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ స్పందించింది. మంగళవారం ఇన్‌ఛార్జి డిప్యూటీ డిఎంహెచ్‌ఒ స్వరూప్, అర్బన్ పిహెచ్‌సి వైద్యురాలు మోహనతో కలిసి పట్టణంలో కొన్ని ఆర్‌ఎంపి వైద్యశాలలపై దృష్టి పెట్టారు. ఎక్కువ ఫిర్యాదులొస్తున్న శ్రీహరిపేటలోని ఓ ఆర్‌ఎంపి నిర్వహిస్తున్న వైద్యశాలపై దాడులు నిర్వహించారు. నరసాపురం వైద్య ఆరోగ్య శాఖ ఈ విషయంలో స్పందించిన తీరుపై అనేక విమర్శలు రావడం గమనార్హం. కనీసం చుట్టుపక్కలా విచారణ చేపట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సదరు ఆర్‌ఎంపికి ముందుగానే వైద్యాధికారులు సమాచారం ఇచ్చి ఆ ఆర్‌ఎంపి అక్కడ నుంచి వెళ్లిపోవడానికి అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ డిఎంహెచ్‌ఒ తనిఖీకి వెళ్లినప్పుడు ఆర్‌ఎంపి నిర్వహణ సామగ్రిని వేరే ప్రాంతాలకు తరలించి ఒంటరిగా అక్కడ ఉండేటట్లు పథకం రచించాడు. ఆర్‌ఎంపిలపై దాడులు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పట్టణంలో అనధికారంగా క్లినిక్‌లు నిర్వహిస్తున్న పలువురు ఆర్‌ఎంపిలు పరారయ్యారు. మొత్తంగా ఉన్నత అధికారుల ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించినప్పటికీ సదరు నకిలీ వైద్యులపై తీసుకునే చర్యల విషయంలో ఇలాంటి ఉదాసీన వైఖరి అవలంబించడంపై విమర్శలు వస్తున్నాయి. డిప్యూటీ డిఎంఎన్‌హెచ్ స్వరూప్ మాట్లాడుతూ నకిలీ వైద్యశాలలు నిర్వహిస్తున్నా, అనధికారంగా వైద్యం చేస్తున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం జరిపిన తనిఖీల్లో ఎలాంటి లోపాలు తాము గుర్తించలేదని పేర్కొన్నారు.