పాలకొల్లు : పాలకొల్లులోని డిఎన్‌ఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో రూ.కోటి 40 లక్షల రూసా నిధులతో నిర్మించే తరగతి గదులకు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని కళాశాలల అభివృద్ధికి రూసా ద్వారా నిధులు కేటాయిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విద్యాలయాల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తోందని, దానికి గత వైసిపి ప్రభుత్వం నాడు, నేడు అంటూ సొంత డబ్బా కొట్టుకున్నారని చెప్పారు. మహిళలు విద్యలో ముందుండి అవకాశాలు అంది పుచ్చుకోవాలి అన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ మహిళా కళాశాల అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. విద్యార్థినుల సమస్య అడిగి తెలుసుకుని సంబంధించిన అధికారులతో మాట్లాడారు. ఎంఎల్‌సి బొర్రా గోపీమూర్తి, ప్రిన్సిపల్ డాక్టర్ పి.శోభారాణి, వైస్ ప్రిన్సిపల్ రవి కుమార్ మాట్లాడారు.
