అంతర్‌ జిల్లా మోటారు సైకిళ్ల దొంగ అరెస్టు

ప్రజాశక్తి – గణపవరం

అంతర్‌ జిల్లా మోటారు సైకిళ్ల దొంగను మంగళవారం అరెస్టు చేసినట్లు ఏలూరు డిఎస్‌పి శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొయ్యలగూడెం మండలం గవరవరం గ్రామవాసి చప్పిడి ముసలయ్య (30) తన భార్య స్వగ్రామం వల్లూరులో ఉంటుండగా అదే గ్రామానికి చెందిన శెట్టి చిన్నాతో స్నేహం పెరిగి దొంగతనాలు చేయడం ప్రారంభించారు. గత నెల 23న అనుమానాస్పదంగా సంచరిస్తున్న చిన్నాను అదుపులోకి తీసుకుని విచారించగా మోటారుసైకిళ్ల దొంగతనాలు చేస్తున్నట్లు వెలుగుచూసింది. చిన్నాను కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించగా, నాటి నుంచి ముసలయ్య పరారీలో ఉన్నాడు. ముసలయ్యను మంగళవారం అదుపులోకి తీసుకుని విచారించగా ఏలూరు, కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో మోటారు సైకిళ్ల దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైందని డిఎస్‌పి తెలిపారు. వీరివద్ద నుంచి 16 మోటారు సైకిళ్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో చాకచాక్యంగా వ్యవహరించిన గణపవరం ఎస్‌ఐ మణికుమార్‌, పోలీస్‌ సిబ్బంది శంకర్‌, బి.హేమసుందర్‌, పి.కాంతయ్య, డి.రత్నకుమార్‌, కె.సత్యనారాయణ, జగపతిబాబును జిల్లా ఎస్‌పి ప్రతాప్‌ శివకిషోర్‌ను అభినందించారు. కార్యక్రమంలో నిడమర్రు సిఐ ఎంవి.సుభాష్‌, గణపవరం ఎస్‌ఐ ఎం.మణికుమార్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

➡️