ఓఅండ్‌ఎం పనులు హుళక్కేనా..!

రాష్ట్ర వ్యాప్తంగా కాలువలు : ఆందోళనలో రైతులు

ప్రజాశక్తి – కాళ్ల

ముందస్తు సాగు పేరుతో జూన్‌ 1న ప్రభుత్వం కాలువలకు నీటిని విడుదల చేసింది. అయితే కాలువలు మూసివేసిన అనంతరం చేపట్టాల్సిన ఆధునికీకరణ పనులు గత ఐదేళ్లుగా అతీగతీ లేని సంగతి అందరికీ తెలిసిందే. అయితే కాలువలకు నీటిని విడుదల చేశాక హడావుడీగా తూడు, గుర్రపు డెక్క, చెత్తాచెదారం, తొలగింపు పనులు చేపట్టి చేతులు దులుపుకోవడం సర్వసాధారణమైంది. అయితే ఈసారి ఎన్నికల కోడ్‌ పేరుతో ఆ పనులకు ప్రభుత్వం ఎగనామం పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో కాలువలకు నీరు విడుదల చేసి పది రోజులు అవుతున్నా శివారు ప్రాంతాలకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది.డెల్టాలో నీటిపారుదల వ్యవస్థలో ఎంతో కీలకమైన లాకులు, వియర్లు, షట్టర్లు శిథిలావస్థకు చేరి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. పునర్నిర్మాణం, మరమ్మతులు సాగునీటి కాలువల నిర్వహణలో అత్యవసర పనులకు నీలినీడలు కమ్ముకున్నాయి. ఏటా వేసవిలో ఓఅండ్‌ ఎం నిధులతో పనులు జరుగుతుంటాయి. దీనికి సంబంధించి ప్రతిపాదనల జాబితా నాలుగు నెలల కిందటే రూపొందించినా నేటికీ ఆమోదం లభించకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పశ్చిమడెల్టాలో ఉండి, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం సబ్‌ డివిజన్ల పరిధిలో 11 ప్రధాన పంట కాలువలు ఉన్నాయి. 4.60 లక్షల ఎకరాల విస్తీర్ణానికి కాటన్‌ బ్యారేజీ నుంచి సాగునీటిని విడుదల చేస్తున్నారు. డెల్టాలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యేది వరి. సాధారణంగా ఓఅండ్‌ఎంలో అత్యవసర పనులను ప్రతిపాదిస్తుంటారు. ఈ ఏడాది నాలుగు సబ్‌ డివిజన్ల పరిధిలో రూ.17.14 కోట్ల అంచనా వ్యయంతో 166 పనులను ప్రతిపాదించారు. వీటిలో తూడు తొలగింపు, పూడికతీత, తారు, ఆయిల్‌పూత, ఎత్తిపోతలు, షట్టర్ల మరమ్మతులు, గట్ల పటిష్టీకరణ పనులు ఉన్నాయి. మరో 12 ఇతర పనులకు రూ.1.26 కోట్ల అవసరమని తేల్చారు. వీటికి ఇప్పటికే ఆమోదం లభిస్తే టెండర్ల స్వీకరణ ప్రక్రియ మొదలయ్యేది.వృథాగా పోతున్న సాగునీరు..ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన లాకులు, సర్‌ ప్లస్‌ ఇయర్‌, అవుట్‌ పాల్‌ స్లూయిజ్‌లు, షట్టర్లు, శిథిలావస్థకు చేరాయి. వీటి పునర్నిర్మాణానికి చేసిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు. కాలువలపై షట్టర్లు సరిగా పనిచేయని చోట్ల సాగునీరు వృథాగా పోతోంది. రబీలో సుమారు 50 వేల ఎకరాలకు పూర్తిస్థాయిలో నీరందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కాలువలో అవరోధాలు తొలగించేందుకు ఒఅండ్‌ఎం నిధులే కొంతమేర ఊరటనిస్తున్నాయి. నిధులు మంజూరు చేయలేదు. శిథిలావస్థలో లాకులు, షట్టర్లు..వెంకయ్య వయ్యేరు, ఉండి పంట కాలువల పరిధిలోని అధిక శాతం లాకులు, షట్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ కాలువల పరిధిలో షట్టర్లు దెబ్బతిన్న కారణంగా పూర్తిస్థాయిలో శివారు గ్రామాలకు నీరందడం లేదు. అధిక వర్షాలు, వరదల సమయంలో శిథిలావస్థకు చేరుకున్న షట్టర్లు, చెక్‌డ్యామ్‌ లేచిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధిక వర్షాలు పడిన సమయాల్లో అన్నదాతలు పడుతున్న వెతలు వర్ణనాతీతం. ఇరిగేషన్‌ శాఖ అధికారులు అత్యవసర పనులపై ఇప్పటికీ శ్రద్ధ చూపడం లేదు. ఇప్పటికైనా కాలువల్లో తూడు గుర్రపుడెక్క, చెత్తా చెదారం తొలగింపు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని రైతులు కోరుతున్నారు.అత్యవసర పనులకు ప్రతిపాదనలు పంపాం..ఇరిగేషన్‌ ఇఇ ఎం.దక్షిణామూర్తినాలుగు సబ్‌ డివిజన్ల పరిధిలో రూ.17.14 కోట్ల అంచనా వ్యయంతో 166 పనులను ప్రతిపాదించాం. కాలవలపై అవసరమైన పనులకు నిధులు మంజూరు కావాల్సి ఉంది. నిధులు మంజూరైన తరువాత పనులు చేపడతాం. జూన్‌ మొదటి వారంలో కాలువలకు నీటిని విడుదల చేస్తాం.

➡️