ప్రజాశక్తి – పాలకొల్లు
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు నాణ్యమైన సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి కోరారు. మంగళవారం స్థానిక తొమ్మిదో వార్డులో ఎండియు వాహనాన్ని, చౌక ధరల దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనంలో ఉన్న స్టాకును పరిశీలించి, ఈ రోజు ఎంతమందికి పంపిణీ చేశారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రానిక్ కాటా తూకాన్ని పరీక్షించారు. పంపిణీలో అవకతవకలుగాని, ఒక్క ఫిర్యాదు రాకుండా పంపిణీ జరగాలన్నారు. ప్రజల నుండి ఎటువంటి ఫిర్యాదొచ్చినా తక్షణం చర్యలు తీసుకుంటామని ఆపరేటర్‌ను హెచ్చరించారు. అదే వార్డులో చౌకధరల దుకాణానికి వెళ్లి స్టాక్‌రూమ్‌ను, రికార్డులను పరిశీలించారు. రిజిస్టర్‌లో ఉన్న స్టాక్ ప్రకారం రూమ్‌లో ఉన్న స్టాక్‌ను లెక్కించి లూజుగా ఉన్న సరుకులు కూడా కాటా వేయించి సరిగా ఉన్నాయని గుర్తించారు. నిత్యావసర సరుకుల పంపిణీ ఎలా ఉంది, క్రమం తప్పకుండా మీకు సరుకులు అందుతున్నాయా అని ప్రజలను అడగగా సక్రమంగా అందుతున్నాయని చెప్పడంతో జెసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించే బాధ్యత మనపై ఉందన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు సలహాలు, సూచనలు ప్రజల నుండి వస్తే వాటిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తూనికల్లో తేడా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జెసి వెంట తహాశీల్దారు వై.దుర్గాకిషోర్, మున్సిపల్ కమిషనర్ బి.విజయసారథి, టౌన్ ప్లానింగ్ ఆఫీసరు వీరబ్రహ్మం, సివిల్ సప్లయీస్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.