మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

పెంటపాడు:మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఎంఇఒకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపవరపు రంగారావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిర్ల పుల్లారెడ్డి, బంకూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ 23 సంవత్సరాల నుంచి ఈ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు గౌరవ వేతనం కింద రూ.3 వేలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయని, రోజుకు వంద రూపాయల కూలికి పనిచేస్తున్న కార్మికులు ఏ విధంగా కుటుంబాలను పోషించుకుంటారని తెలిపారు. ఒకపక్క నిత్యావసర ధరలు, కరెంట్‌ ఛార్జీలు, గ్యాస్‌ ధరలు ఇంటి అద్దెలు, స్కూల్‌ ఫీజులు, వైద్య ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నా వారి జీతాలు మాత్రం పెరగడం లేదని తెలిపారు. కేరళ రాష్ట్రంలో రోజుకు రూ.600 కనీస వేతనం అమలు చేస్తోందని, ఆ విధంగా ఇక్కడ కూడా అమలు చేయాలని కోరారు. ఈ పథకంలో పనిచేస్తున్న వారికి గుర్తింపు కార్డులివ్వాలని, స్కూల్‌ సీపర్లకు కూడా కనీస వేతన జిఒ అమలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.దయామణి, వి.శ్రీదేవి, ఎం.విమల, వై.విజయకుమారి, ఎం.జ్యోతి, కె.ప్రియాంక, కె.పద్మ, బి.శాంతి, కసిరెడ్డి అచ్చమ్మ, సిహెచ్‌.మాధవి, కె.బాలమ్మ, రాఘవ, కొండ జ్యోతి, జామి రామలక్ష్మి పాల్గొన్నారు.

➡️