ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం
మాధవరం, కంసా లిపాలెం బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని, ఎర్రకాలువ ముంపు నుంచి శాశ్వత పరిష్కారం కనుగొనాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతకాయల బాబూరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం తాడేపల్లిగూడెం మండల ఎనిమిదో మహాసభ మంగళవారం మాధవరంలో జరిగింది. ఈ మహాసభకు ముఖ్య వక్తలుగా సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతకాయల బాబూరావు హాజరయ్యారు. ముందుగా గ్రామంలో నిర్మించిన సిపిఎం స్తూపాన్ని సందర్శించి పార్టీ జెండాను బాబూరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యానికి ఏటా ఎర్రకాలువ ముంపునకు గురై రైతులు పంట నష్టపోతున్నారన్నారు. తక్షణం కూటమి ప్రభుత్వం ఎర్రకాలువ ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలని, మాధవరం, కంసాలపాలెం మధ్యలో ఉన్న బ్రిడ్జిని తక్షణం నిర్మించాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి బలరాం మాట్లాడుతూ తాడేపల్లిగూడెం మండలం చారిత్రాత్మకమైందని, వీర జవాన్లను అందించిన మిలటరీ మాధవరం, అలాగే కమ్యూనిస్టు లగడ్డ ఎర్ర దండగర్ర ఈ రెండు గ్రామాలకు ఎంతో చరిత్ర ఉందని వీరి త్యాగఫలం వృథా కాదని తెలిపారు. ఆ వీరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మించాలన్నారు. మండల పూర్వపు కార్యదర్శి పి.గోవిందు మాట్లాడుతూ అప్పారావుపేటలో పేదలకు భూములు పంచిన ఘనత సిపిఎం దేనని, చుట్టుపక్కల గ్రామాల్లో అనేక ప్రజా సమస్యలు తీసుకుని పోరాడిన చరిత్ర సిపిఎంకు ఉందని తెలిపారు. పెంటపాడు మండల కన్వీనర్ సిరపరపు రంగారావు మాట్లాడుతూ మండలంలో స్కీం వర్కర్ల, బిల్డింగ్ రంగం సమస్యలపై సిపిఎం అనేక పోరాటాలు చేస్తోందన్నారు. మహాసభకు అధ్యక్ష వర్గంగా కండెల్లి సోమరాజు, పాలుపూరి సత్యవతి జయమ్మ వ్యవహరించారు. మహాసభలో ప్రజా నాట్యమండలి దళం జిల్లా కార్యదర్శి షేక్ వలీ, పోతు శ్రీను దుర్గ పాడిన విప్లవ గీతాలు అలరించాయని పేర్కొన్నారు. ఈ మహాసభలో సిద్ధాపత్తుల నాగేశ్వరరావు, పూరెళ్ల సుబ్బారావు, కండెల్లి విజయ, మడక రాజు, మల్లుల పరమేశు, పి.కృపారావు పాల్గొన్నారు.