మలేరియా నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత

డాక్టర్‌ బి.సాయి చంద్ర

ప్రజాశక్తి – ఉండి

మలేరియా నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని డాక్టర్‌ బి.సాయి చంద్ర అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శనివారం ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ బి.సాయి చంద్ర ఆధ్వర్యంలో మలేరియాను నిర్మూలించాలని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిచంద్ర మాట్లాడుతూ దోమలు కుట్టడం వల్ల మలేరియా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. మలేరియాను నిర్మూలించాలంటే దోమల వ్యాప్తిని అరికట్టాలని, నీటి నిల్వ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో క్రిమి సంహారక మందులు చల్లాలని అన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేగా నిర్వహించాలన్నారు. దోమలు రాకుండా దోమతెరలను వాడాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమల మందును పిచికారీ చేయించి పరిసరాలలో కొట్టించాలని రోగులకు జాగ్రత్తలు తెలిపారు. ఈనెల 30వ తేదీ వరకు మండలంలోని అన్ని గ్రామాల్లోనూ తమ సిబ్బంది పర్యటించి ప్రజలకు మలేరియా నివారణపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య విస్తరణ అధికారి ఆర్‌.కృష్ణ కుమార్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.

➡️