ఇసుక అందుబాటులో ఉంచేలా చర్యలు

ప్రజాశక్తి – భీమవరం

జిల్లాలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని నియోజకవర్గాల్లో ఇసుక అందుబాటులో ఉంచేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నాగరాణి మాట్లాడుతూ జిల్లాకు ఐదు లక్షల మెట్రిక్‌ టన్నులు ఇసుక సేకరణ లక్ష్యంగా నిర్ణయించుకుని రానున్న వర్షాకాలం కంటే ముందుగా ప్రతి నియోజకవర్గంలో 70 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుకను డంప్‌ చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుని రవాణా పూర్తి చేయాలన్నారు. భీమవరం, ఆచంట, నరసాపురం, పాలకొల్లు, తణుకు, ఉండి, తాడేపల్లిగూడెం స్టాక్‌ యార్డులను ఏర్పాటు చేశామని, ప్రతిరోజూ సుమారు 60 ట్రక్కులకు తక్కువ కాకుండా జిల్లాకు ఇసుక రవాణా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి బి.రవికాంత్‌, ఆర్‌టిఒ ఉమామహేశ్వరరావు, జిల్లా భూగర్భ జల శాఖాధికారి కె.గంగాధర్‌, ధవళేశ్వరం గోదావరి రివర్‌ కన్జర్వేటర్‌ ఇఇ ఆర్‌.కాశీవిశ్వేశ్వరరావు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఎఇ ఎస్‌.రమేష్‌, తహశీల్దార్లు, ఏజెన్సీలు, టిప్పర్‌ యజమానులు పాల్గొన్నారు.సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటుకు స్థలాలు గుర్తించాలి పిఎం సూర్యఘర్‌ పథకం కింద ఎస్‌సి, ఎస్‌టి లబ్ధిదారుల వినియోగానికి సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి విద్యుత్‌ శాఖాధికారులను ఆదేశించారు. ఆమె జిల్లాలోని విద్యుత్‌ శాఖ ఇఇలు, డిఇలు, ఎఇలతో గూగుల్‌ మీట్‌ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకు 14,392 దరఖాస్తులు రిజిస్ట్రేషన్‌ చేయగా 917 గృహాలకు మాత్రమే సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు చేశారన్నారు. ఈ పథకం అమలు అనుకున్నంత వేగంగా జరగటం లేదని అసహనం వ్యక్తం చేశారు. కనీసం నెలకు ప్రతి మండలానికి 24 కనెక్షన్లు పూర్తి చేసేలా శ్రద్ధ వహించాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి లబ్ధిదారులకు ప్యానెల్స్‌ ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను గుర్తించాలన్నారు. జిల్లా విద్యుత్‌ శాఖ అధికారి రఘునాథ్‌ బాబు, అధికారులు పాల్గొన్నారు.’ఉల్లాస్‌’ను వినియోగించుకోవాలి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు చదువు ఎంతో ముఖ్యమని, దీనిలో భాగంగా ఉల్లాస్‌ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన ‘ఉల్లాస్‌’పై జిల్లాస్థాయి కన్వర్జెన్సీ కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు జిల్లాలోని 21,628 మంది స్వయం సహాయక సంఘాల మహిళ సభ్యులను లక్ష్యంగా చేసుకుని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. మే 5వ తేదీ నుండి సెప్టెంబర్‌ 20వ తేదీ వరకు ఆరు నెలలపాటు ఈ కార్యక్రమం ద్వారా అక్షరాస్యతను పెంపొందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఉల్లాస కార్యక్రమాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టి 3,895 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దారని తెలిపారు. సమావేశంలో వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్‌ జి.సిహెచ్‌.ప్రభాకర్‌, కమిటీ సభ్యులు డిఆర్‌డిఎ పీడీ ఎంఎస్‌ఎస్‌.వేణుగోపాల్‌, మెప్మా ఎఒ జి.హెప్సిబా, డిపిఆర్‌ఒ టి.నాగేశ్వరరావు, ఐసిడిఎస్‌ పీడీ బి.సుజాతరాణి, డిఇఒ ఆఫీస్‌ ఎడి సత్యనారాయణ, జెడ్‌పి సూపరింటెండెంట్‌ బివిఎస్‌వి.శర్మ, జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అధికారి వై.దోసిరెడ్డి పాల్గొన్నారు.

➡️