నరసాపురం: నరసాపురం ప్రాంతాన్ని ఒక పర్యాటక హబ్‌గా రూపొందిస్తామని, తద్వార ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం నరసాపురం పట్టణంలో వైఎన్ కళాశాల జరుగుతున్న ప్లాటినం జూబ్లీ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎంతోమంది ప్రముఖులను రాష్ట్రానికి అందించిన ఘనత వైఎన్ కళాశాల అని, దీనిని సమర్ధవంతంగా నిర్వహిస్తున్న డాక్టర్ చినమిళ్లి సత్యనారాయణ రావుకి అభినందనలన్నారు. వంద సంవత్సరాల పండుగ కూడా ఇదే స్ఫూర్తితో చేసుకోవాలని ఆకాంక్షిస్తూ, డీమ్డ్ యూనివర్శిటీ స్థాయికి త్వరలో చేరుతుందన్నారు. ఈ కళాశాలలో విద్యను అభ్యసించిన వారు ఉత్తమ సంస్కార వంతులని, నైతిక విలువలను కలిగి ఉన్నారని, ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలను వినియోగించుకుని, సమగ్రంగా అభివృద్ధి చెందడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేశామని, టూరిజంను ఒక పరిశ్రమగా గుర్తించి, అభివృద్ధి చేస్తామని, అంతర్వేది మంచి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు దంపతులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నయనాల జయ సూర్య, ఓఎన్ జిసి జనరల్ మేనేజర్ కెఎస్.రామారావు, ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం పాల్గొన్నారు.