మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ విధానాలు మానాలి

ప్రజాశక్తి – తణుకు

మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ విధానాలు అమలు చేయడం మానుకోకపోవడం సిగ్గుచేటని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ విమర్శించారు. మంగళవారం స్థానిక నరేంద్ర సెంటర్‌లో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ, నిరసన తెలిపారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని, కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ విధానం రద్దు చేసి పర్మినెంట్‌ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్‌ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం సర్వ సంపదలు సృష్టించే కార్మికులకు, ప్రజలకు తిండి పెట్టే రైతుల సమస్యలను పరిష్కరించకపోవడం అన్యాయమన్నారు. గత పదేళ్లలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు రూ.19.28 లక్షల కోట్లు రుణమాఫీ, పన్ను రాయితీ, ప్రోత్సాహాల పేరుతో ప్రజా ధనం దోచుకుందని తెలిపారు. రైతులకు ఇచ్చిన మాటను మోడీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడకపోతే బిజెపి మరింత మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రతాప్‌ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు ఎన్‌.ఆదినారాయణబాబు, కార్యదర్శి గుబ్బల గోపి, గార రంగారావు, వల్లూరి వెంకటేశ్వరరావు, అయ్యప్ప, శ్రీనివాసరాజు, త్రిమూర్తులు, సురేంద్ర, కొమరరాణి, అనంతలక్ష్మి, అనిల్‌, శివ, శ్రీను పాల్గొన్నారు.యలమంచిలి : ప్రభుత్వం అంగన్వాడీలు, ఆశాలు, ఇతర స్కీం వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో మండలంలోని కొంతేరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు శ్రీవర్థిని, దేవ సుధాకర్‌ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి స్కీం వర్కర్లందరికీ రూ.26 వేల వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాన్ని ఆపాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం మండల కార్యదర్శి కానేటి బాలరాజు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రోజా, కుమారి, లక్ష్మి పాల్గొన్నారు.

➡️