ప్రజాశక్తి – భీమవరం
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, ప్రజా సమస్యలపై పోరాటాలే తమ ఊపిరి అని పిడిఎఫ్ ఎంఎల్‌సిలు మరోసారి చాటుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సిగా గెలుపొందిన పిడిఎఫ్ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి సోమవారం సాయంత్రం ఎన్నిక ధ్రువీకరణపత్రాన్ని అందుకున్న 24 గంటలు గడవక ముందే సిపిఎస్ ఉద్యమంలో భాగస్వాములై పిడిఎఫ్ విశిష్టతను చాటారు. విజయవాడలో ఎపి సిపిఎస్‌ఇఎ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన సిపిఎస్ వ్యతిరేక ఉద్యమంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొని ఉద్యోగ, ఉపాధ్యాయులకు అండగా నిలబడ్డారు. సాధారణంగా ఎంఎల్‌సి, ఎంఎల్‌ఎగా గెలిచిన వెంటనే అలసిపోయామంటూ రిలాక్స్ అవుతుంటారు. లేకపోతే సేద తీరేందుకు వేరే ప్రాంతానికి వెళ్తుంటారు. అయితే పిడిఎఫ్ ఎంఎల్‌సి గోపీమూర్తి మాత్రం దానికి భిన్నంగా ఉద్యమంలో పాలుపంచుకోవడం విశేషం. ఈ సందర్భంగా గోపీమూర్తి మాట్లాడుతూ సిపిఎస్ రద్దు కోసం ఆది నుంచి పోరాటం చేస్తున్నామని, ఇది రద్దయే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.