ప్రజాశక్తి – తణుకు
మృతి చెందిన, అనారోగ్యంతో బాధపడుతున్న మున్సిపల్ కార్మికుల స్థానంలో వారి పిల్లలకు ఉద్యోగాలివ్వాలని సిఐటియు మండలాధ్యక్షులు ఎన్.ఆదినారాయణబాబు, కార్యదర్శి గుబ్బల గోపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. మృతి చెందిన, అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికుల స్థానంలో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, రిటైర్‌మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని, గ్రాట్యూటీ ఇవ్వాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆదినారాయణబాబు, గుబ్బల గోపీ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోగా ఉన్న సౌకర్యాలను తొలగించడం దారుణమన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు లేక కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆర్జి కృష్ణబాబు, అనంతలక్ష్మి, రాణి, మందులయ్య, రమేష్, జ్యోతి బాబు, నాగేంద్ర కుమార్, రాజమ్మ, సోంపద్మ, గంగాధర్, సురేష్, లోవరాజు, రమణ, రాజేశ్వరి, కృష్ణారావు, కుసుమ, శ్రీను, నాని, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.