15 నుంచి పాలకొల్లులోజాతీయ స్థాయి నాటిక పోటీలు

ప్రజాశక్తి – పాలకొల్లు

సమాజాన్ని చైతన్యవంతం చేసేది, మానవ రుగ్మతలను రూపు మాపేది నాటకం. కళలకు, సాంఘిక నాటక రంగానికి పుట్టినిల్లు పాలకొల్లు. ఆధునిక నాటక రంగం అభివృద్ధికి పునాధులు వేసిన ఎందరో మహోన్నత వ్యక్తులు పాలకొల్లుకు చెందిన వారు కావడం గర్వించదగ్గ విషయం. కులంలేని పిల్ల, పంజరంలో పక్షులు, ఆడది, పల్లె పడుచు వంటి ప్రజాదరణ పొందిన నాటికలు రచించిన పినిశెట్టి శ్రీరామ్మూర్తిది పాలకొల్లు కావడం గర్వకారణం. దాసరి నారాయణరావు రచించిన ‘నేను నా స్కూల్‌’ నాటిక అనేక ప్రదర్శనలు జరిగాయి. కోడి రామకృష్ణ రథ చక్రాలు నాటిక రచించి, ప్రదర్శనలు చేసి అనేక బహుమతులు సాధించారు. పాలకొల్లులో కళా పరిషత్‌లకు 60 సంవత్సరాల క్రితమే శ్రీకారం చుట్టారు. అయితే ఈనెల 15వ తేదీ నుంచి మూడు రోజుల పాటు పాలకొల్లు బస్టాండ్‌ సెంటర్లో అడబాల ధియేటర్‌ వెనుక ఖాళీ స్థలంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి నాటిక పోటీలు నిర్వహించడానికి పాలకొల్లు కళా పరిషత్‌ అధ్యక్షులు కెవి.కృష్ణవర్మ, గౌరవ అధ్యక్షులు మేడి కొండ శ్రీనివాసరావు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. కెఎస్‌ పిఎన్‌.వర్మ, విఠాకుల రమణ, మానాపురం సత్యనారాయణ, జక్కంపూడి కుమార్‌, కొణిజేటి గుప్త, షేక్‌ పీర్‌ సాహెబ్‌, కొల్లి కొండ ప్రసాద్‌, సోమంచి శ్రీనివాస శాస్త్రి, రెడ్డి వాసు, దాసరి నాని, నడపన శ్రీనివాసరావు, అంగర వీరభద్ర కుమార్‌, జిఎస్‌ఎన్‌.రవి సహకారాలు అందజేస్తున్నారు. నాటిక పోటీల ప్రారంభం రోజు జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాసు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. 15న అరవింద ఆర్ట్స్‌, తాడేపల్లి వారి విడాకులు కావాలి, ఉషోదయ కళా నికేతన్‌ కట్రపాడు వారి కిడ్నాప్‌, 16న మిత్రా క్రియేషన్స్‌ హైదరాబాద్‌ వారి ఇది రహదారి కాదు, చైతన్య కళా స్రవంతి విశాఖపట్నం వారి (అ)సత్యం, మద్దుకూరి క్రియేషన్స్‌, చిలకలూరిపేట వారి మా ఇంట్లో మహాభారతం, 17న అమరావతి ఆర్ట్స్‌ గుంటూరు వారి చిగురు మేఘం, మైత్రి కళా నిలయం, విజయవాడ వారి బ్రహ్మస్వరూపం, నటీనట సంక్షేమ సమాఖ్య పాలకొల్లు వారి అనూహ్యం నాటికలు ప్రదర్శింపబడతాయి. అనంతరం స్థానిక రాజకీయ ప్రముఖులు, జిల్లాలోని పరిషత్‌ నిర్వాహకులతో పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. 3 రోజుల పాటు పాలకొల్లులో జరిగే నాటికల పండుగను విజయవంతం చేయాలని సంస్థ అధ్యక్షులు కెవి.కష్ణవర్మ కోరారు.

➡️