రోడ్లు, డ్రెయినేజీలు వద్దు..గుక్కెడు నీళ్లివ్వండి..

ప్రజాశక్తి – చింతలపూడి

మాకు రోడ్లు వద్దు.. డ్రెయినేజీలు వద్దు.. తాగడానికి గుక్కెడు నీళ్లివ్వండి మహాప్రభో అంటూ చింతలపూడి మండలం మల్లయ్యగూడెం, ఎసి అగ్రహారం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి తాగునీటి సమస్య ఉన్నా అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు.మండలం మల్లయ్యగూడెం ఎసి అగ్రహారం, ఆముదాలచిలక గ్రామస్తులు తాగడానికి నీరులేక నానా అవస్థలు పడుతున్నారు. ఉన్న నీరు కూడా ఉప్పగా ఉండడంతో వాడుకోవడానికి తప్ప తాగడానికి పనికిరాని పరిస్థితి నెలకొంది. దీంతో డబ్బులిచ్చి తాగునీరు కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంతమంది నాయకులకు, అధికారులకు సమస్య చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకులు ఓట్లు అడగడానికి వెళ్తే తమకు ఏమీ వద్దు తాగడానికి నీళ్లు కావాలని అడిగారంటే ఆయా గ్రామాల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆముదాలచిలకకు చెందిన కొందరు గ్రామస్తులు డబ్బులు పెట్టి టిన్నులు కొనుగోలు చేయలేక రోజూ ఊరికి దూరంగా ఉన్న బావి నుంచి నీరు తీసుకెళ్తున్నారు. బావి దూరంగా ఉండడం, బావిలో నీరు కూడా పాతలానికి వెళ్లడంతో నీటిని తోడలేక మహిళలు నానా ఇబ్బందులు పడుతున్నారు.నీరు కావాలంటే కిలోమీటరు నడవాల్సిందే..ఎసి అగ్రహారం మహిళలు రోజూ ఉదయం, సాయంత్రం తాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. కిలో మీటరు వరకూ నడిచి బిందెలతో మోసుకొని వెళ్తున్నారు. ఆముదాలచిలక గ్రామస్తుల పరిస్థితి కూడా అంతే. ఒక్కోసారి పనులకు వెళ్లి రాత్రి 8, 9 గంటలైనా చీకటిలో తాగునీటి కోసం వెళ్లాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో 20 లీటర్ల వాటర్‌ టిన్ను రూ.5, తరువాత రూ.8, ప్రస్తుతం రూ.10 నుంచి రూ.15 తీసుకుంటున్నారు. అదే కూలింగ్‌ వాటర్‌ అయితే రూ.30 నుంచి రూ.40 వరకూ తీసుకుంటున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. రోజుకు రూ.200 కూలి ఇస్తారని, రూ.50 వరకూ తాగునీటి కోసం ఖర్చు చేస్తున్నామని తెలిపారు. వేసవిలో పనుల్లేక కరువు పనికి వెళ్తున్నామని రోజూ డబ్బులిచ్చి నీరు ఎలా తెచ్చుకోవాలని ప్రశ్నిస్తున్నారు.మల్లయ్యగూడెం సర్పంచి చీకటి రమేష్‌ స్థలం ఇచ్చి షెడ్డు కట్టిస్తానని చెబుతున్నారని, బోర్‌ మోటార్‌, కరెంట్‌ కలెక్షన్‌ ఇస్తే వాటర్‌ ప్లాంట్‌ కట్టిస్తానని చెబుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో తమకు తమకు ఇబ్బందులు తప్పడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకోవాలని బోర్‌ వేయించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.నీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం..కళ్యాణి, మల్లయ్యగూడెం మాకు తాగునీరే ప్రధాన సమస్య. గుక్కెడు నీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. రోజూ డబ్బులిచ్చి నీటిని కొనుగోలు చేసే స్తోమత లేదు. ఎన్నిసార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. తాగునీటి సమస్యను పరిష్కరించండి. ఇక ఏమీ అడగం.టిన్ను నీరు కొనే స్థోమత లేదు..సావిత్రి, ఎసి అగ్రహారం మేం కూలి పనులు చేసుకుని బతుకుతున్నాం. టిన్ను నీరు కొనే ఆర్థిక స్థోమత మాకు లేదు. నీరు లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. పాలకులు ఓట్ల సమయంలో వస్తారే తప్ప తరువాత మమ్మల్ని పట్టించుకోరు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు మాకు తాగునీరందిస్తే అదే పదివేలు. తాగునీరు ఇవ్వండి..రావనమ్మ, ఆముదాలచిలక నీరు లేక కిలోమీటరు వెళ్లి బావి నుంచి నీరు రోజు తెచ్చుకొని తాగుతున్నాం. ఉన్న నీరు ఉప్పగా ఉంటున్నాయి. అవి తాగడానికి పనికిరావడం లేదు. అధికారులు సమస్యను పట్టించుకోవాలి.సమస్యను పరిష్కరిస్తాను..రమేష్‌, సర్పంచి భర్త స్థలం ఇచ్చి షెడ్‌ కట్టిస్తాను. బోర్‌ మోటార్‌, కరెంట్‌ కలెక్షన్‌ ఇస్తే వాటర్‌ ప్లాంట్‌ కట్టిస్తాను. గ్రామస్తులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరిస్తాను.

➡️