ప్రజాశక్తి – భీమవరం
జిల్లాలో చేనేతను ప్రోత్సహించేందుకు వాటిని ధరించడంలో ఉన్న సౌలభ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజలు కూడా చేనేత వస్త్రాలను ధరించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం స్థానిక డిఎన్‌ఆర్ కళాశాల సిల్వర్ జూబ్లీ సమావేశం మందిరంలో జిల్లా చేనేత శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో చేనేత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలన్నారు. చేనేత వస్త్రాల కొనుగోలు ద్వారా చేనేత కార్మికులకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. వస్త్రాలు ధరించడంలో సౌలభ్యంతోపాటు ఆరోగ్యపరంగా కూడా మంచి చేకూరుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 95 శాతం చేనేత ఉత్పత్తులు మన దేశం నుండే ఉన్నాయన్నారు. స్వదేశీ ఉద్యమంలో భాగంగా స్వాతంత్ర సమరయోధులు చేనేతకు మంచి ఆదరణ తీసుకొచ్చారన్నారు. నేటి యువతకు చేనేత వస్త్రాల గురించి పెద్దలు చెబితేగానీ తెలియని విషయంగా మారిందన్నారు. చేనేత వస్త్రం తయారీలో కార్మికుల కష్టం ఎక్కువగా ఉంటుందని, అయితే ఆ వస్త్రాలకు మనం చెల్లించే ఖరీదు తక్కువేనని చెప్పాలన్నారు. జిల్లాలో సుమారు 1,027 మంది చేనేత కార్మికులు ఉన్నారన్నారు. సమావేశంలో తన దృష్టికి వచ్చిన చేనేత కార్మికుల సమస్యలు, సూచనలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. చేనేత కార్మికులు సిద్ధాని విఘ్నేశ్వరరావు, సమతం చిన్న సముద్రంలింగంలను కలెక్టర్ శాలువా కప్పి సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా చేనేత శాఖ డెవలప్‌మెంట్ ఆఫీసర్ బి.రామయ్య, ఎడిఒ జి.గుర్రాజు, డిఎన్‌ఆర్ కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహారాజు, వైస్ ప్రెసిడెంటు గోకరాజు పాండురంగరాజు, జాయింటు సెక్రెటరీ కె.రామకృష్ణంరాజు, కళాశాల ప్రిన్సిపల్ జి.మోజెస్, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, చేనేత కార్మికులు, విద్యార్థులు పాల్గొన్నారు.