ఓపి.. ఫీ’జులుం’..!

ప్రయివేటు ఆసుపత్రులపై ప్రభుత్వ పర్యవేక్షణ కరువు

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి ‘

వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కాలునొప్పితో తాడేపల్లిగూడెంలో ఓ ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లారు. ఓపీ చీటీ కింద రూ.400 తీసుకున్నారు. వారం మాత్రమే పని చేస్తుందని చెప్పారు. వారం రోజులు దాటి ఒక్కరోజు గడిచినా మళ్లీ రూ.400 పెట్టి ఓపీ చీటీ తీసుకోవాల్సిందే అన్నారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో ఓపీ చీటీ నుంచి మందుల వరకూ బాదుడే బాదుడు అన్నట్లు పరిస్థితి మారిపోయింది’. ఏలూరుకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి పట్టణంలోని ప్రయివేటు ఆసుపత్రికి వెళ్తే ఓపీ చీటీ కింద రూ.500 తీసుకున్నారు. కేవలం పది రోజులు మాత్రమే గడువు అన్నారు. ఇదేమని అడిగితే మా ఆసుపత్రిలో ఇంతేనని సమాధానమిచ్చారు. పరీక్షలు, మందుల పేరుతో బిల్లు తడిసిమోపెడైంది.’ ప్రయివేటు ఆసుపత్రులపై వైద్యఆరోగ్యశాఖ పర్యవేక్షణ కొరవడింది. దీంతో ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఓపీ (అవుట్‌ పేషెంట్‌) చీటీ దగ్గర నుంచి రక్త పరీక్షలు, స్కానింగ్‌లు, మందుల పేరుతో జనాలను నిలువు దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉంది. చిన్నపాటి అనారోగ్యం వచ్చిన సామాన్య ప్రజానీకం బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. ఆహారంలో కల్తీ, మారిన జీవనశైలితో చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ రోగాలు చుట్టుముడుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో అరకొర సదుపాయాలే ఉండటంతో జనం ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్తే ఇల్లు, ఒల్లు గుల్ల చేస్తున్న దుస్థితి నెలకొంది. ఏలూరు జిల్లాలో మొత్తం 262 ప్రయివేటు ఆసుపత్రులు ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోనూ అదే సంఖ్యలో ఆసుపత్రులు ఉన్నాయి. రెండు జిల్లాల్లో దాదాపు 500 వరకూ ప్రయివేటు ఆసుపత్రులు ఉన్నాయి. ప్రతిరోజూ వేలాది మంది రోగులు ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్తుంటారు. ఇంతమంది జనం వెళ్తున్న ఆసుపత్రుల గురించి వైద్యఆరోగ్యశాఖ అసలు పట్టించుకోవడం లేదు. నిబంధనల ప్రకారం నెలకోసారి తనిఖీలు చేయాలని ఉన్నప్పటికీ అటువంటి పరిస్థితి లేదనే చెప్పాలి. ముఖ్యంగా ఓపీ ఫీజు విషయంలో నిబంధనలు ఏమిటో ఏఒక్కరికీ అర్థంకాని పరిస్థితి ఉంది. ప్రయివేటు ఆసుపత్రులు ఓపీ ఫీజులను ఇష్టానుసారం పెంచేస్తూ గడువు సమయాన్ని తగ్గించేస్తున్నాయి. ఓపీ ఫీజు అనేది ఏవిధంగా నిర్ణయిస్తారు.. దీనికి నిబంధనలు ఏమైనా ఉన్నాయా.. లేక ఇష్టానుసారంగా నిర్ణయించుకోవచ్చా అనేది అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. రక్తపరీక్షలు, స్కానింగ్‌లు అక్కడే చేయించుకోవాలి. మందులు సైతం అక్కడే తీసుకోవాలి. ఆ మందులు మరెక్కడా దొరకవు. నిబంధనల ప్రకారం ఓపీ ఫీజు నుంచి పరీక్షల వరకూ అన్నింటికీ సంబంధించి వసూలు చేసే ధరల పట్టిక ఆసుపత్రుల ఆవరణలో బోర్టు పెట్టి ప్రదర్శించాల్సి ఉంది. అటువంటి పరిస్థితి ఎక్కడా కానరాని పరిస్థితి. ఎక్స్‌రే ఖరీదు రూ.300 ఉండగా చాలా ఆసుపత్రుల్లో రూ.450 వరకూ వసూలు చేస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే అనేక కారణాలు చెబుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వైద్యుల నుంచి ఆసుపత్రి సిబ్బంది వరకూ రోగులపై తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించడం పరిపాటిగా మారిపోయింది. వేరే ఆసుపత్రికి వెళ్లాలని సమాధానం సైతం వస్తోంది. ప్రయివేటు ఆసుపత్రుల నిర్వహణకు సంబంధించిన నిబంధనలపై వైద్యఆరోగ్యశాఖ సైతం ప్రజలకు అవగాహన కల్పించడం లేదు. ప్రయివేటు ఆసుపత్రుల నుంచి అధికారులు మాముళ్లు తీసుకుని పట్టించుకోవడం లేదనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి.చిన్నపాటి రోగానికి సైతం రూ.వేలల్లో ఖర్చు జ్వరంతో ప్రయివేటు ఆసుపత్రికి వెళ్తే కనీసంగా రూ.నాలుగు నుంచి రూ.ఐదు వేలు ఖర్చవుతోంది. నిబంధనల ప్రకారం మందుల చీటిపై మందు పేరు మాత్రమే రాయాలి. ప్రయివేటు ఆసుపత్రుల్లో ఇప్పటికీ బ్రాండ్‌ పేర్లే రాస్తున్నారు. అవి వారి ఆసుపత్రిలో తప్ప ఇంకా ఎక్కడా దొరకని పరిస్థితి ఉంటుంది. కిడ్నీ, ఊపరితిత్తులు వంటి పెద్ద సమస్యలతో వెళ్తే ఎంత బిల్లు అవుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. ఆరోగ్యశ్రీ ఉన్నా చాలాచోట్ల సొమ్ము వసూలు యథేచ్ఛగా సాగిపోతుంది. ఫిర్యాదు చేస్తే సరిగా పట్టించుకోరనే భయంతో రోగులు, వారి బంధువులు నిస్సహాయంగా ఉండిపోతున్నారు. ఆరోగ్యశ్రీలో వైద్యం చేస్తూ అదనపు సొమ్ము వసూలు చేస్తే ఫిర్యాదు చేయండంటూ ఆరోగ్యశ్రీ అధికారులు చెబుతున్నా పెద్దగా రోగులు ముందుకు రాని పరిస్థితి ఉంది. ప్రయివేటు ఆసుపత్రుల్లో దోపిడీపై ప్రభుత్వం దృష్టి సారిస్తేనే సామాన్య ప్రజానీకానికి మేలు జరిగే అవకాశం ఉంది. లేకపోతే కష్టపడి సంపాదించిందంతా ప్రయివేటు ఆసుపత్రులకే సరిపోయే పరిస్థితి.

➡️