ప్రభుత్వ స్థలానికి పంగనామం..!

ప్రజాశక్తి – భీమవరం

సహజంగా ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వ అధికారులు రక్షిస్తూ ఉంటారు. అయితే పాలకోడేరు అధికారులు మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. కాసులిస్తే చాలు స్థలం ఏదైనా నిబంధనలు ఎన్నున్నా అవేమీ పట్టించుకోరు. అడ్డగోలుగా తీర్మానాలు.. అనుమతులు ఇచ్చేస్తారు. గొల్లలకోడేరులో పెట్రోల్‌ బంకు ఏర్పాటుకు ప్రభుత్వ స్థలమిస్తూ ఉన్నతాధికారులకు నివేదిక అందించడమే దీనికి నిదర్శనం. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సుమారు రూ.5 కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలం అన్యక్రాంతమయ్యే పరిస్థితి ఏర్పడింది. భీమవరం-తాడేపల్లిగూడెం రహదారిలో గొల్లలకోడేరు వద్ద ప్రధాన రహదారిని ఆనుకుని పాలకోడేరుకు చెందిన సర్వే నెంబర్‌.4లో 61 సెంట్లు ప్రభుత్వ, ప్రయివేటు భూమి ఉంది. దీనిలో ప్రయివేట్‌ వ్యక్తికి సుమారు 24 సెంట్లు స్థలం ఉంది. దీనికి ఇరువైపులా ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బి శాఖలకు చెందిన సుమారు 36 సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నట్లు ఇటీవల సర్వే నిర్వహించి అధికారులు కూడా నిర్ధారించారు. ఈ భూమి ఖరీదు అక్షరాల సుమారు రూ.5 కోట్లు పలుకుతుందని అంచనా. అయితే ఈ ప్రభుత్వ స్థలం మధ్యభాగంలోని 24 సెంట్లు భూమిలో పెట్రోల్‌ బంక్‌ నిర్మాణనికి అధికారులు అనుమతులిచ్చారు. వాస్తవానికి పెట్రోల్‌ బంక్‌ నిర్మాణానికి 24 సెంట్లు స్థలం సరిపోదు. పాలకోడేరు పంచాయతీ పాలకవర్గ సభ్యులు దీని నిర్మాణానికి అడ్డు చెప్పినప్పటికీ అడ్డగోలుగా అధికారులు పంచాయతీ తీర్మానం చేసి నో అబ్జెక్షన్‌ కూడా ఇచ్చేశారు. దీన్ని ఆసరాగా చేసుకున్న రెవెన్యూ అధికారులు కూడా పెట్రోల్‌ బంక్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగల్‌ ఇస్తూ ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు ప్రచారం సాగుతోంది.పదేళ్ల క్రితం ప్రభుత్వ స్థలానికి రక్షణగా నిలిచిన తహశీల్దార్లు సుమారు పదేళ్ల క్రితం ఈ ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతానికి గురవుతున్న నేపథ్యంలో అప్పటి తహశీల్దారులు ప్రభుత్వ స్థలానికి రక్షణగా నిలిచారు. అప్పటి గొల్లలకోడేరు సర్పంచి పెచ్చెట్టి సుబ్రహ్మణ్యం చొరవతో తహశీల్దార్‌లు చవాకుల ప్రసాద్‌, గంజి రత్నమణి ప్రభుత్వ స్థలాన్ని రక్షించారు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి సరిహద్దు రాళ్లు నిర్ణయించారు. ప్రస్తుతం ఆ రాళ్లు కన్పించకుండా పోయాయి. ఇటీవల నిర్వహించిన సర్వేలో కూడా ప్రభుత్వ స్థలం ఉన్నట్లు అధికారులు నిర్థారించారు.చుట్టూ ప్రభుత్వ స్థలమున్నా అనుమతులు ఎలా..! పెట్రోల్‌ బంకు నిర్మించే స్థలం ఇరువైపులా ప్రభుత్వ స్థలం ఉంది. ఈ నేపథ్యంలో పెట్రోల్‌ బంకుకు వెళ్లేందుకు మార్గం లేదు. ప్రభుత్వ స్థలంలో నుంచి వెళ్లాల్సి ఉంది. అయితే పెట్రోల్‌ బంకు సంబంధించిన స్థలం కొంతమేర ఉన్నప్పటికీ అది ఏ విధంగాను అనువైంది కాదు. మరి రెవెన్యూ అధికారులు ఏ విధంగా అనుమతులకు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారనేది చర్చనీయాంశమైంది.నిబంధనలు పాటించకపోతే చర్యలుకె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, భీమవరం ఆర్‌డిఒ పెట్రోల్‌ బంక్‌ నిర్మాణానికి సంబంధించిన ఫైల్‌ నా దగ్గరకు వచ్చింది. దీనిని పరిశీలించాల్సి ఉంది. ప్రభుత్వ స్థలం ఉన్నట్లయితే దానిని రక్షిస్తాం. నిబంధనలు పాటించకపోతే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

➡️