ప్రజాశక్తి – భీమవరం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఆర్భాటంగా నిర్వహించి మహిళలకు సత్కారాలు చేసి, ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి రెండు రోజులు గడవక ముందే అంగన్‌వాడీలపై తీవ్ర నిర్బంధాన్ని విధించింది. సాక్షాత్తూ కేంద్ర మంత్రి నుంచి జిల్లా కలెక్టర్, డిప్యూటీ స్పీకర్, పిఎసి ఛైౖర్మన్‌తో పాటు ఎంఎల్‌ఎలంతా మహిళల కోసం పలికిన పలుకులు నీటి రాతలుగా మిగిలాయి. తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి అంగన్వాడీలు విజయవాడలో సోమవారం తలపెట్టిన మహాధర్నాను భగం చేసేందుకు ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించింది. ఆదివారం రాత్రి నుంచి అంగన్‌వాడీల ఆచూకీ కోసం పోలీసులు గాలించారు. మహిళా పోలీసులను అంగన్‌వాడీల ఇళ్ల చుట్టూ తిప్పి ఆరా తీశారు. విజయవాడ మహాధర్నాకు వెళ్లొద్దంటూ కొంతమందికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే అంగన్‌వాడీలు ఇవేమీ పట్టించుకోకుండా తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సోమవారం తెల్లవారుజాము నుంచి విజయవాడ పయనమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి తీవ్ర నిర్బంధాన్ని విధించింది. విజయవాడ బయలుదేరిన వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మహిళలని చూడకుండా రోడ్డు పక్కనే నిర్బంధించి నిలువు కాళ్లపై నిలుపుదల చేశారు. పాలకొల్లు రైల్వేస్టేషన్లో 70 మందిని, తణుకు బస్టాండ్లో 30 మందిని, చేబ్రోలు వద్ద 40 మందిని, పెనుమంట్ర వల్లూరు వద్ద 20 మందిని, తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్‌లో 40 మందిని, మొగల్తూరుకు చెందిన 70 మంది అంగన్వాడీలను పోలీసులు నిర్బంధ విధించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 300 మంది వరకూ విజయవాడ వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. కొంతమంది మహిళలు పోలీసుల నిర్బంధాన్ని బెదిరింపులను లెక్కజేయకుండా విజయవాడ మహాధర్నాకు తరలివెళ్లారు. మొగల్తూరుకు చెందిన కొంతమంది అంగన్‌వాడీలను విజయవాడ రైల్వేస్టేషన్లో నిర్బంధించారు. తరువాత వదిలేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా అంగన్‌వాడీలు నేలపై బైఠాయించి ఆందోళనకు దిగారు. నల్లరిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల అసహనం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీలపై పోలీసు నిర్బంధాన్ని, ప్రయోగించిన చర్యలను అంగన్‌వాడీ యూనియన్లు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. నిర్బంధంతో ఉద్యమాన్ని ఆపలేరుఅంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి డి.కళ్యాణి అంగన్‌వాడీలు 42 రోజులు తమ సమస్యలపై ఉధృత పోరాటం చేశారు. అప్పట్లో టిడిపి, జనసేన మద్దతు తెలిపి అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 9 నెలలైనా హామీలు అమలుకు నోచుకోలేదు. 2019 నుంచి ఒక్కపైసా కూడా జీతాలు పెరగలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, జిఒలు ఇవ్వడంతో పాటు పని భారాన్ని తగ్గించాలని కోరుతూ మహా ధర్నాకు వెళ్తున్న వారిపై నిర్బంధం విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సమస్యలు పరిష్కరించకపోగా పరిష్కారం చూపాలని అడుగుతున్న పాపానికి అత్యంత దుర్మార్గంగా వ్యవహరించి నిర్బంధాన్ని ప్రయోగించడం దారుణం. కూటమి ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుంది. నరసాపురం : విజయవాడ ధర్నాకు వెళ్తున్న అంగన్‌వాడీలను ప్రభుత్వం పోలీసులతో నిర్బంధించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని సిఐటియు జిల్లా కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడ వెళ్తున్న అంగన్‌వాడీలను నరసాపురం రైల్వేస్టేషన్లో డిఎస్‌పి జి.శ్రీవేద, పట్టణ సిఐ బి.యాదగిరి, ఎస్‌ఐ ముత్యాలరావుతో పాటు సర్కిల్ సిబ్బంది, మహిళ పోలీసులతో అడ్డుకున్నారు. వెయింట్ హాల్లో వారిని నిర్బంధించారు. ఈ నిర్బంధాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకూ నోటికి నల్లగుడ్డ కట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించకుండా వారిపై పోలీసుల నిర్బంధాన్ని ప్రయోగించడం దారుణమన్నారు. వారి సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కె.భోగేశ్వరి, వి.వెంకటలక్ష్మి ఎస్.రామసీత, బి.సంగీత, పి.రాణి, పి.సుభాషిని పాల్గొన్నారు.పాలకొల్లు : అంగన్‌వాడీల అక్రమ నిర్భందాన్ని ఖండిస్తున్నామని సిఐటియు నాయకులు జవ్వాది శ్రీనివాసరావు అన్నారు. చలో విజయవాడకు వెళ్ల నివ్వకుండా పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. పాలకొల్లు రైల్వేస్టేషన్‌లో కూడా 100 మందిని నిర్బందించారని శ్రీనివాసరావు తెలిపారు. ధర్నాలో పద్మావతి, ధనలక్ష్మి, శ్యామల, నాగగౌరీ, పెద్దిలక్ష్మి పాల్గొన్నారు.తణుకు : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్‌వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చలో విజయవాడ వెళ్తున్న అంగన్‌వాడీలను ఇంటి వద్ద నిర్బంధించడం, అక్రమ అరెస్టులు చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండించింది. ఈ సందర్బంగా ప్రతాప్ మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం 42 రోజుల పాటు సాగిన పోరాటం అందరికీ తెలుసు అన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు ఎన్.ఆదినారాయణ బాబు, గార రంగారావు, కనకదుర్గ, ధనలక్ష్మి, రమాదేవి, మధు షీల, సుబ్బలక్ష్మి, కనక మహాలక్ష్మి, బిందు, సత్య, విజయ, నాగ దుర్గ, రాధా, వాణి శ్రీ, గంధం జ్యోతి, ఉమామహేశ్వరీ, లలిత కుమారి, రత్నకుమారి, వరలక్ష్మి, నాగలక్ష్మి, నాగదుర్గ పాల్గొన్నారు.తణుకు : సమస్యల పరిష్కారానికి అంగన్వాడీలు విజయవాడలో జరిగే మహాధర్నాను భగం చేసేందుకు ప్రభుత్వం అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ప్రయోగించింది. ఈ నేపథ్యంలో పలువురు అంగన్‌వాడీలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సుమారు 50 మంది అంగన్‌వాడీలను తణుకు బస్‌స్టాండ్‌లో పట్టణ ఎస్‌ఐ, ఎఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు అడ్డుకున్నారు. వారందరినీ పోలీసులు బలవంతంగా తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి నిర్భంధించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ మాట్లాడారు. పెనుమంట్ర : విజయవాడలో జరిగే ధర్నాలో పాల్గొనేందుకు కదిలిన అంగన్‌వాడీ కార్యకర్తలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నా వారు విజయవాడ చేరుకున్నారని ప్రతినిధులు తెలిపారు.