సర్వసభ్య సమావేశం వాయిదా

యలమంచిలి : మండలంలో వివిధ అభివృద్ధి పనులను సమీక్షించే నిమిత్తం శుక్రవారం ఇన్‌ఛార్జి ఎంపిపి గొల్లపల్లి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరగాల్సిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి వైసిపి సభ్యులు బాయికాట్‌ చేయడంతో సభ వాయిదా పడింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు ప్రారంభమైన మండల పరిషత్‌ సమావేశానికి టిడిపి సభ్యులు ముగ్గురు, జనసేన సభ్యులు ఒకరు ఇటీవల వైసిపి నుంచి టిడిపిలోకి వెళ్లిన మేడపాడు ఎంపిటిసి సహా ఐదుగురు సభ్యులు, వైసిపికి చెందిన 12 మంది సభ్యులతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఐతే ఇటీవల జరిగిన ఎంపిపి ఉప ఎన్నికల్లో తమకి 12 మంది సభ్యులు బలం ఉన్నప్పటికీ కావాలనే ఎన్నిక జరగకుండా కూటమి నాయకులు అడ్డుకుని తమను అవమానపరిచారని, దీనికి నిరసనగా సమావేశాన్ని బాయికాట్‌ చేస్తున్నామని వైసిపి సభ్యులు తమ నిరసనను తెలియజేస్తూ సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. దీంతో అధ్యక్ష స్థానంలో ఉన్న ఇన్‌ఛార్జి ఎంపిపి గొల్లపల్లి శ్రీనివాస్‌తో టిడిపి ఎంపిటిసిలతో పాటు పెదలంక, ఇలపకుర్రు సర్పంచులు తాళ్ల నాగరాజు, కొండేటి జీవరత్నం మాట్లాడుతూ వైసిపి చేతగానితనంతోనే అనివార్యంగా ఎంపిపి ఉప ఎన్నిక వచ్చిందని ఇది మీ తప్పిదం కాదా అని ప్రశ్నించడంతో పాటు ఎన్నాళ్లు బారుకాట్‌ చేస్తారని ప్రశ్నించారు. అనంతరం సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని ఎంపిడిఒ ప్రేమాన్విత ప్రకటించటతో సమావేశం ముగిసింది.

తాడేరు సహకార బ్యాంకులో ఆన్‌లైన్‌ సేవలు

భీమవరం టౌన్‌ : రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 20 ఏళ్ల పాటు చేసిన పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాల కంప్యూటరీకరణ ప్రక్రియ చేపట్టిందని, ఏడాది కాలంలో 50 శాతం ప్రక్రియ పూర్తయిందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల ఫెడరేషన్‌ కార్యదర్శి నందమూరి సుబ్బారావు చెప్పారు. తొలి దఫాలోనే మండలంలోని తాడేరు సొసైటీ పూర్తిస్థాయి కంప్యూటరీకరణ పూర్తయిందని వెల్లడించారు. శుక్రవారం తాడేరు సహకార సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సహకార సంఘాల కంప్యూటరీకరణ ప్రక్రియ గురించి వివరించారు. తాజాగా భీమవరం ప్రాంతంలో సొసైటీల కంప్యూటరీకరణ పూర్తిగా జరిగిందని చెప్పారు. తాడేరుతో పాటు గూట్లపాడు, కొమరాడలో కూడా ఈ ప్రక్రియ పూర్తయిందన్నారు. సహకార సంఘాల ఉద్యోగులు 20 సంవత్సరాల పాటు ఈ కంప్యూటరీకరణ కోసం పోరాటం చేసిందన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 259 సహకార సంఘాలు ఉండగా, ప్రస్తుతానికి సగం వరకు పూర్తయ్యాయని చెప్పారు. సహకార సంఘాలలో ఆన్లైన్‌ ప్రక్రియ పూర్తి చేస్తే రైతులకు చాలా మెరుగైన సేవలు అందించవచ్చు అన్నారు. రైతులకు పారదర్శకంగా సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని, ఎటువంటి అవినీతి, విధుల్లో జాప్యం జరిగే అవకాశం ఉండదని చెప్పారు. గతం నుంచి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరినప్పుడు ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని సుబ్బారావు చెప్పారు. ఇప్పుడు ఆ సమస్య పరిష్కారమైనందున ఉద్యోగులు కోరుతున్న జిఒ నెంబర్‌ 36 తక్షణమే అమలు చేయాలన్నారు.

➡️