ప్రజాశక్తి – భీమవరం
‘ఒకపక్క నాణ్యమైన సీడ్ దొరకట్లేదు.. మరోపక్క ఫీడ్ ధరలు అధికంగా ఉన్నాయి. ఇంకోపక్క వైరస్ ప్రభావం.. రొయ్యలకు సరైన ధర లేక గత ఆరు నెలల నుంచి సతమతమవుతుంటే ట్రంప్ విధించిన సుంకం కుతలం చేసింది. తక్షణం ఆక్వా రైతాంగాన్ని ఆదుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేసేందుకు సిద్ధం’ అని ఆక్వా రైతుల సదస్సు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆక్వా రైతుల సదస్సు సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు, ఎపి రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బి.బలరాం హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి సదస్సుకు వచ్చిన ఆక్వా రైతులు అనేక సమస్యలను సదస్సు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వాలకు విదేశీ మారకద్రవ్యం సమకూరుస్తున్నప్పటికీ ఆక్వారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆక్వా రంగం ట్రంప్ టారిఫ్ దెబ్బతో సంక్షోభంలో పడిందన్నారు. సిండికేట్ మాయాజాలం ఆక్వా రంగాన్ని కుదిపేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని వేసినా ఎటువంటి ఉపయోగమూ లేదన్నారు. ఆక్వా రైతులు చేపట్టే ఆందోళనలకు సిపిఎం పూర్తి మద్దతు ఇస్తుందని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు అండగా ఉంటామని చెప్పారు. అవసరమైతే ప్రత్యక్షంగా రంగంలోకి దిగి సమస్యల పరిష్కారానికి అన్ని సంఘాలను కలుపుకుని కృషి చేస్తామన్నారు. రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యాగరమైన ఈ జిల్లాలో ఆక్వా రంగం అభివృద్ధి చెందుతున్న సమయంలో క్లిష్టమైన పరిస్థితులు రావడం బాధాకరమన్నారు. ఐక్యతతోనే సమస్యలు పరిష్కారమవుతాయని, అంతా ఒక తాటిపైకి వచ్చి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర పూర్వపు నాయకులు మంతెన సీతారాం మాట్లాడుతూ ఆక్వా రంగంలో అనేక మంది కార్మికులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు ఉపాధి పొందుతున్నారన్నారు. అలాంటి రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం సరైనది కాదన్నారు. ఆక్వా రంగాన్ని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుసంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరేరామ్ సదస్సుకు ఆహ్వానం పలకగా, జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబురావు వందన సమర్పణ చేశారు. ప్రజా కళాకారులు షేక్ వలీ, చైతన్య ప్రసాద్ గీతాలను ఆలపించారు. సదస్సులో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రారు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ. కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.రామాంజనేయులు, ఆక్వా రైతు వర్రె ముసలయ్య, ఆక్వా రైతులు పాల్గొన్నారు.ఐదు డిమాండ్లతో తీర్మానాన్ని ఆమోదించిన సదస్సు ఆక్వా రైతుల సదస్సు ఐదు డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించింది. ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, ట్రంప్ సుంకాలు విరమించేందుకు చర్యలు చేపట్టాలని, 100 కౌంట్‌కు రూ.270 గిట్టుబాటు ధర కల్పించాలని, ఫీడ్ టన్నుకు రూ.30 వేలు తగ్గించాలని, ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్‌తో సంబంధం లేకుండా రూ.1.50కే యూనిట్ విద్యుత్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సదస్సులో తీర్మానం ఆమోదించారు.ఆక్వా పరిరక్షణ నూతన జిల్లా కమిటీ ఎన్నిక సదస్సులో ఆక్వా పరిరక్షణ నూతన కమిటీని ఎన్నుకున్నారు. బల్లేపల్లి శ్రీనివాసరావు, నక్క కుమార్, గుత్తుల శ్రీరామచంద్రుడు, షేక్ ఆలీ హుస్సేన్, సందక సూరిబాబు, తిరుమాని నాగేశ్వరరావు, పాలా వెంకటస్వామి, తాటి పట్టి ప్రసాద్, కేశన యాదగిరి, వర్రే ముసలయ్య, కాస నరసింహులు, రుద్రరాజు యువరాజుతో కమిటీ ఎన్నికైంది.ఆక్వా రైతుల నిరసన ర్యాలీ స్థానిక మావుళ్ళమ్మ గుడి రోడ్లో సిపిఎం ఆధ్వర్యంలో ఆక్వా రైతులను ఆదుకోవాలని, అమెరికా సుంకాలను ఎత్తివేయాలని ఆక్వా రైతులు నిరసన ర్యాలీ చేపట్టారు. సదస్సుకు హాజరైన నేతలంతా ర్యాలీలో పాల్గొన్నారు.ఆదాయం ప్రభుత్వానికి.. ఆత్మహత్యలు రైతులకు..్య్య్యబి.బలరాం, రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు 30 ఏళ్ల క్రితం ఆక్వా సాగును ప్రారంభించింది సన్న, చిన్నకారు రైతులే. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఈ రైతులే ఉన్నారు. అప్పట్లో రొయ్య డాలర్ పంట. కిలో రూ.500 ఉండేది. ఇప్పుడు సీడ్ నాణ్యత లేదు. ఫీడ్ ధర ఎక్కువగా ఉంది. సాగు వ్యయం విపరీతంగా పెరిగింది. దీనికితోడు ప్రభుత్వ విధానాలు సరిగా లేవు. ఫలితంగా ఆక్వా రంగం సంక్షోభంలో పడింది. ప్రభుత్వాలకు ఆదాయం సమకూర్చుతుంటే రైతులకు మాత్రం ఆత్మహత్యలు మిగులుతున్నాయి. మత్స్యశాఖ, ఎంపెడా, నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ అసలున్నాయో, లేవో కూడా తెలియదు. 30 ఏళ్ల క్రితం భీమవరంలో ఆక్వా సదస్సు నిర్వహించింది. ఎంపెడా కార్యాలయాన్ని సిపిఎం ముట్టడిస్తే ఛైర్మన్ వచ్చి అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గుర్తు చేశారు. ప్రభుత్వ పెద్దలు అంతా ఎగుమతిదారులుగా ఉన్నారు. రైతుల బాధ వాళ్లకి ఎలా తెలుస్తుంది. ఫీడ్, సీడ్ ధరల తగ్గింపు, విద్యుత్ రాయితీలు కూటమి ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుంది.ఆక్వా రైతుల సమస్యలు పట్టని ప్రభుత్వం..్య్య్యజెఎన్‌వి.గోపాలన్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఒకప్పుడు జిల్లా ధాన్యాగారంగా పిలవబడేది. ప్రస్తుతం వ్యవసాయం మరుగున పడుతుంది. ఆక్వా సాగు విస్తరించింది. జిల్లాలో 20 మండలాలు ఉంటే 12 మండలాల్లో ఆరు వేల మంది వరకు రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. విద్యుత్ రాయితీ వర్తించట్లేదు. ఏడాదికి రూ.25 లక్షలు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. ఫీడ్ ధర విపరీతంగా పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఫీడ్ కిలో రూ.25 తగ్గించాలి. ప్లాంట్ యజమానులు సిండికేట్ అయ్యారు. ట్రంప్ సుంకం ప్రకటించారో, లేదో ఇక్కడ రేటు తగ్గించారు. ఆక్వా రైతులకు ఉండాలనే ఈ సదస్సు నిర్వహిస్తున్నాం.ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది..్య్య్యబొల్లెంపల్లి శ్రీనివాసరావు, ఆక్వా రైతు 25 ఏళ్ల నుంచి రొయ్యల సాగు చేస్తున్నాను. అప్పట్లో టన్ను మేత ధర రూ.25 వేలు ఉంటే ప్రస్తుత రూ.లక్ష ఉంది. 60 కౌంటు ధర అప్పుడు రూ.450 ఉంటే ఇప్పుడు రూ.300కు తగ్గింది. 30 కౌంట్ ధర కూడా రూ.500 నుంచి రూ.400కు తగ్గింది. 10 నెలల నుంచి మేత ధరలు తగ్గలేదు. ట్రంప్ సుంకం మరిన్ని నష్టాలు తెచ్చిపెట్టింది. రూ.1.50 విద్యుత్ సబ్సిడీ కూడా వర్తించట్లేదు. 100 కౌంట్ కిలో సాగు ఖర్చు రూ.250 అవుతుంది. దీన్ని ప్రభుత్వం రూ.220కు కొనుగోలు చేయమంటోంది. ఇదీ అమలు కావడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే ఆత్మహత్యలు తప్పవు. ఆక్వా రైతాంగ సమస్యల పరిష్కారానికి సిపిఎం ముందుకు రావడం అభినందనీయం.రైతాంగానికి ప్రభుత్వం చేయూతనివ్వాలి..్య్య్యనక్క కుమార్, ఆక్వా రైతు వంద మంది రైతులు వరి సాగు చేస్తే అందరికీ ఎంతోకొంత లబ్ధి చేకూరుతుంది. ఆక్వా సాగు నూటికి 20 నుంచి 30 మందికి మాత్రమే లాభాలు చేకూరుస్తుంది. మిగిలిన రైతులందరికీ నష్టాలే వస్తున్నాయి. గిట్టుబాటు ధర లేకపోవడం దీనికి ప్రధాన కారణం. రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవు. ప్రస్తుతం 36 వేల టన్నుల రొయ్యలు ఎగుమతవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు 10 లక్షల ఎకరాల్లో సాగు చేయమంటున్నారు. 36 వేల టన్నుల ఎగుమతికి దిక్కు లేకపోతే అన్ని ఎకరాల్లో సాగు చేయటం వల్ల రైతులకు ఇబ్బందులు తప్ప మరేది ఉండదు.కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలి..్య్య్యడి.రవితేజ, ఆక్వా రైతు ఫీడ్ ధర తగ్గలేదు. అయితే సుంకం పేరుతో రూ.40 నుంచి రూ.60 వరకూ రొయ్య ధర తగ్గించారు. గాలి, వాన వస్తే విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఎవరూ పట్టించుకోవట్లేదు. మార్కెటింగ్ సమస్య తీవ్రంగా ఉంది. నాలుగు నెలల నుంచి కంటి మీద కునుకు లేదు. మిర్చి అపరాలు వంటి వాటికి కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. లాభాలు తెచ్చిపెడుతున్న ఆక్వా సాగుకు మాత్రం కోల్డ్ స్టోరేజీలు లేవు. కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తే ఆక్వా రైతులకు ఉపయోగకరం.ఆక్వా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు..్య్య్యషేక్ ఆలీ హుస్సేన్, ఆక్వా ఎక్స్‌పోర్టర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయి. 2014లో ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేస్తామని మోడీ చెప్పారు. ఆక్వా హబ్‌గా ఈ ప్రాంతాన్ని మారుస్తామన్నారు. ఆక్వా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇవేమీ అమలు కాలేదు. మత్స్య శాఖ అసలు పని చేయట్లేదు. నేషనల్ ఫిషరీష్ డెవలప్‌మెంట్ శాఖ ఉందో, లేదో కూడా తెలియదు.రొయ్యలు పోషకాహారమని అవగాహన కల్పించాలి..్య్య్యకృష్ణారావు, రైతు కార్యాచరణ సమితి సభ్యులు చెరువుల లీజు దగ్గర నుంచి అడుగడుగునా అనేక సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతం లీజు రూ.1.50 లక్షల వరకు ఉంది. ఫీడ్, సీడ్ ధరలు విపరీతంగా ఉన్నాయి. కోల్డ్ స్టోరేజీలు లేవు. 80 నుంచి 90 శాతం ఇక్కడ పండించిన రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి. రొయ్యలు ఎంతో పోషక విలువలు కలిగినవి. అయితే ఇక్కడ మాత్రం ఇవి తినరు. కేజీ మటన్ రూ.11 వందలున్నా కొంటారు. కానీ రూ.220 ఉన్న రొయ్యలు మాత్రం కొనరు. రొయ్యలు పోషకాహారమని అందరిలో అవగాహన కల్పించాలి.