బరులు సిద్ధం..!

ప్రజాశక్తి – గణపవరం

సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందేలను నివారిస్తామని అధికారులు గ్రామాల్లో సమావేశాలు, అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తున్నప్పటికి పందెం రాయుళ్లు మాత్రం ఏటా మాదిరిగానే గణపవరంలో బరులు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈసారి అధికార పక్షమైన టిడిపి నేతలు గణపవరం శివారున బరిని సిద్ధం చేస్తుండగా, జనసేన నేతలు ఇందిరమ్మ కాలనీలో బరిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఈ సారి రసవత్తరంగా పందేలు జరుగుతాయని స్థానికులు అంటున్నారు. పందాలు గణపవరంలో వేయడానికి అవకాశం లేకపోతే తాడేపల్లిగూడెంలో ఏర్పాటుకు పందాలరాయుళ్లు పావులు కదుపుతున్నారు. గతేడాది కోడిపందేల బరికి కోటి రూపాయలు వసూలు చేశారు. ఈ సారి రెండు పార్టీల నేతలు కూడా బరులు ఏర్పాటుకు ఎక్కువ మొత్తంలో సొమ్ములు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పాలకొల్లు : పాలకొల్లు నియోజకవర్గంలో కోడిపందేలకు అప్పుడే ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. గతంలో నిర్వహించిన చోటే కోడిపందేలు, జూదం బరులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది కూడా అధికార పార్టీకి ఎక్కువ బరులను వదిలినట్లు తెలుస్తోంది. గతంలో పాలకొల్లులో మూడు బరులు భారీ స్థాయిలో నిర్మించేవారు. అయితే ఈ బరుల వల్ల నిర్వాహకులు ఆశించినంత లాభాలు చూడకపోవడంతో ముగ్గురు కలిసి ఒకే బరి నిర్వహించేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. గతంలో యలమంచిలి మండలం కలగంపూడి గ్రామానికి వెళ్లే దారిలో భారీ పందెం నిర్వహించేవారు. అయితే ఈసారి జాతీయ రహదారి పక్కనే జూదం నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ సారి పోలీసు అధికారులు కూడా అంతంతమాత్రంగానే హెచ్చరికలు జారీ చేశారు.

➡️