సమస్యల నిలయాలు.. కాలనీలు

ప్రజాశక్తి – భీమవరం

మానవుడు జీవించాలంటే కూడు, గుడ్డ, నీరు కనీస అవసరాలుగా ఉన్నాయి. అయితే ఇవి నేటికీ అందని ద్రాక్షగానే ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా, ప్రజా ప్రతినిధులు ఏలుతున్నా మనిషి జీవన స్థితిగతులు మాత్రం మారడం లేదు. ఫలితంగా పాలకుల నిర్లక్ష్యానికి ఎన్నో నిరుపేద కుటుంబాలు సమస్యలే వారి ఆవాసాలుగా జీవనం సాగిస్తున్నారు. ఎవరికి చెప్పినా.. ఎన్నిసార్లు తిరిగినా.. పట్టించుకునే నాధుడే లేకపోవడంతో బరువెక్కిన గుండెతో కాలం గడుపుతున్న నిరుపేదలకు సిపిఎం ప్రజా చైతన్య సైకిల్‌ యాత్ర భరోసా నింపింది. ఈ నేపథ్యంలో నిరుపేదలు సైకిల్‌ యాత్ర బృందానికి సమస్యలు ఏకరువు పెట్టి కన్నీరు మున్నీరుగా విలపించారు. అధైర్య పడొద్దు అండగా ఉంటామంటూ ప్రజా చైతన్య సైకిల్‌ యాత్ర బృందం మనోధర్యాన్ని నింపింది. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకూ అండగా ఉంటామంటూ భరోసానిచ్చింది.జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇళ్లు, ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్లు, ఇళ్ల పట్టాల సమస్యలపై ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకూ సిపిఎం జిల్లా వ్యాప్తంగా ప్రజా చైతన్య సైకిల్‌ యాత్ర చేపట్టింది. పది రోజులపాటు సాగిన ఈ యాత్ర 20 మండలాలు, 6 పట్టణాలు సుమారు 80 గ్రామాల్లో 130 కిలోమీటర్లకు పైగా సాగింది. సైకిల్‌ యాత్ర దళ నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్‌ సారథ్యంలో మరో 15 మంది నాయకులు బృందంగా ఏర్పడి జిల్లా నలుమూలలు తిరిగి సమస్యలపై అధ్యయనం చేశారు. అడుగడుగునా పేదలు బృందం వద్ద సమస్యలు ఏకరువు పెట్టారు. జిల్లాలో భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకులో 20,784 టిడ్కో గృహాలు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా కేవలం 8 వేల మందికి మాత్రమే వీటిని అప్పగించారు. అయితే ఇక్కడ నివాసముంటున్న వారు తాము సమస్యలతో సహవాసం చేస్తున్నమంటూ బృందం వద్ద వాపోయారు. తాగునీరు, డ్రెయినేజీ, మరుగుదొడ్లు, స్లాబ్‌ లీకేజీ, రోడ్లు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు లేక ఇబ్బందులు పడడమే కాకుండా కనీసం బియ్యం అందించే వాహనాలు కూడా రావట్లేదంటూ కంటతడి పెట్టారు. మరి కొంతమంది తమకు గృహాలు కేటాయించకుండానే బ్యాంకు అధికారులు రుణాలు కట్టాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు రూ.500 కోట్లకుపైగా అప్పుల పాలయ్యారని సైకిల్‌ యాత్ర పర్సనల్‌లో తేలిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సుమారు ఎనిమిదేళ్ల క్రితం నిర్మించుకున్న గృహాలకు బకాయిలు సైతం చెల్లించిన పాపాన పోలేదని ఆందోళన చెందారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వ భూముల్లో తినీ తినక ఇల్లు నిర్మించుకుని జీవనం సాగిస్తుంటే కాలుష్యం, అభివృద్ధి పేరుతో అన్యాయంగా ఇళ్లను తొలగిస్తున్నారంటూ పాలకోడేరు, ఆకివీడు, కాళ్ల, ఉండి మండలాల నిరుపేదలు బృందం వద్ద వాపోయారు. వారి సమస్యలను బృందం సభ్యులు వింటూనే సమస్యలపై వ్యక్తిగత దరఖాస్తులు స్వీకరించారు. ప్రధానంగా రేషన్‌కార్డులు, డ్రెయినేజీ, తాగునీరు, రోడ్లు, పెన్షన్లు, శ్మశానవాటిక వంటి సమస్యలను తీసుకొచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్‌ నిరుపేదల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా పంచాయతీ అధికారి అరుణశ్రీ, నరసాపురం ఆర్‌డిఒ దాసిరాజు, యలమంచిలి తహశీల్దార్‌, చించినాడ గ్రామ కార్యదర్శులతో ఫోన్‌ ద్వారా సమస్యలు పరిష్కరించాలని కోరారు. అయితే జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సైకిల్‌ యాత్ర ద్వారా వచ్చిన సమస్యల పరిష్కారానికి సిపిఎం ఈ నెల 17న భీమవరం కలెక్టరేట్‌ వద్ద భారీ ధర్నా చేపట్టింది. లబ్ధిదారులు నిరుపేదల సమస్యలపై వ్యక్తిగత వినతులు, విజ్ఞాపనలను కలెక్టర్‌ చదలవాడ నాగరాణికి అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ ధర్నాకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.బలరాం హాజరు కానున్నారు. జిల్లా నలుమూల నుంచి వేలాది మంది ధర్నాకు తరలివచ్చి విజయవంతం చేయాలని సిపిఎం పిలుపునిచ్చింది.మనుషులుగా గుర్తించడం లేదు.. కోనేటి మరియమ్మ, జయంతి కాలనీ, తణుకు నాకు భర్త లేడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా నాన్నకు కళ్లు లేవు. వీళ్లని చూసుకుంటూ ఇళ్లల్లో పాచి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. ఉండటానికి కనీసం ఇల్లు లేదు. ఎంతోమందికి సమస్యను చెప్పినా పట్టించుకోలేదు. చచ్చేలోపు అయినా మా బతుకులు మారతాయో లేదో అని భయమేస్తోంది. కనీసం మమ్మల్ని మనుషులుగా కూడా గుర్తించట్లేదు.పట్టా ఇచ్చారు.. స్థలం కేటాయించలేదు ఆకుల రమణ , ఇరగవరం మాకు 2012లో ఇంటి పట్టా ఇచ్చారు. ఇంతవరకూ స్థలం కేటాయించలేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాం. అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. దయచేసి మాకు కేటాయించిన స్థలాన్ని చూపిస్తే మేము ఇల్లు కట్టుకుంటాం. పిల్లలతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. మా గోడు పట్టించుకుని సమస్య పరిష్కరించాలి. సమస్యలు పట్టించుకోవడం లేదు.. గ్రంథి సోమ అయ్యప్ప, వడలి2019లో 123 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇక్కడ నాతో పాటు 40 మందికిపైగా ఇల్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నాం. ఏళ్లు గడుస్తున్నా కనీసం సౌకర్యాలు కల్పించలేదు. రోడ్డు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఎవరూ పట్టించుకోకపోవడంతో తలో రూ.4 వేలు వేసుకొని రోడ్డుపై ఇసుక వేసుకున్నాం. డ్రెయినేజీ లేక వర్షం వస్తే మోకాళ్లలోతు నుంచి నడిచి వెళ్లాల్సి వస్తుంది. తాగునీరు రాకపోవడంతో దూర ప్రాంతం వెళ్లి తాగాల్సి వస్తుంది. పెన్షన్‌ కోసం ముప్పు తిప్పలు పెడుతున్నారు జనిపల్లి నాగమణి, సిద్ధాంతంగతేడాది నా భర్త ప్రమాదంలో మృతి చెందాడు. ముగ్గురి కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి ఒంటరిగా జీవిస్తున్నాను. గతంలో నా భర్తకు పింఛను వచ్చేది. ఆయన చనిపోయిన తర్వాత ఆ ఫించను నాకు ఇవ్వమని అడిగిన ఇవ్వట్లేదు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఉపయోగం లేకుండా పోయింది. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. నాకు పింఛను ఇప్పించాలని కోరుతున్నాను.పాలకుల నిర్లక్ష్యం నిరుపేదలకు శాపం జెఎన్‌వి.గోపాలన్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి, భీమవరంపార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య సైకిల్‌ యాత్రలో జిల్లా ప్రజల సమస్యలపై ఏకరువు పెట్టారు. వారి ఇబ్బందులు వర్ణనాతీతం. ఎన్నో ఏళ్ల నుంచి సమస్యలతో సహవాసం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారిపోతున్నా, ప్రజా ప్రతినిధులు వస్తున్నా వారి సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇది అత్యంత దారుణం. స్వతంత్ర దేశంలో బతుకుతున్నామా లేక బ్రిటీష్‌ కాలంలో ఉన్నామా అనేది అనుమానంగా ఉంది. దీనంతటికీ కారణం పాలకుల నిర్లక్ష్యమే నిరుపేదలకు శాపంగా మారింది. ప్రజల ఓట్లతో గెలిచి వారి సమస్యలను పెడచెవిన పెట్టి వ్యక్తిగత ఆర్థిక స్వలాభం కోసం పాకులాడడం ఎంతవరకూ సమంజసం. సైకిల్‌ యాత్ర దృష్టికి వచ్చిన ప్రతి సమస్యనూ ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. సమస్యలపై ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించి పోరుబాటకు సిద్ధమవుతాం.

➡️