ప్రజాశక్తి – భీమవరం
రైతాంగానికి గిట్టుబాటు ధరను గ్యారెంటీ చేస్తూ చట్టం చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా, వెనక్కి తీసుకుంటానన్న నల్ల చట్టాలను దొడ్డిదారిన అమలు చేస్తూ, కార్మిక కోడ్‌ల పేరుతో చట్టాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ భీమవరంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. స్థానిక సిఐటియు కార్యాలయం నుంచి కార్మిక, కర్షకులు పెద్ద ఎత్తున ప్రదర్శనగా ప్రకాశం చౌక్ చేరుకుని ధర్నా చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ ఆకుల హరేరామ్ అధ్యక్షత వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు కోనాల భీమారావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు పి.జమలయ్య మాట్లాడారు. రైతు నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన అమలు చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను పక్కన పెట్టిందన్నారు. రైతు పండించిన పంటలకు అయిన పెట్టుబడికి 50 శాతం కలిపి గిట్టుబాటు ధరకు చట్టం చేయాలని రైతు పోరాటం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇప్పటివరకూ హామీ నెరవేర్చలేదని విమర్శించారు. లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులకు రుణమాఫీ చేయడం లేదన్నారు. కౌలు రైతు సంఘం నాయకులు మామిడి శెట్టి రామాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బాతిరెడ్డి జార్జి, శ్రామిక మహిళా నాయకురాలు డి.కళ్యాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను గుడ్డిగా సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు అన్యాయం చేస్తోందన్నారు. ట్రూఅప్ ఛార్జీల పేరుతో రూ.17 వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేయడానికి పూనుకుంటోందన్నారు. అనంతరం కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించి జెసి టి.రాహుల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బి.వాసుదేవరావు, కర్రి నాగేశ్వరరావు, కె.లక్ష్మణరావు, ఆనంద్, ఎం.ఆంజనేయులు, ఇంజేటి శ్రీనివాస్, అశ్రియ్య, గొర్ల రామకృష్ణ, కె.ఝాన్సీలక్ష్మి, నాగరత్నం, వరలక్ష్మి గోపాలకృష్ణంరాజు, పిల్లి ప్రసాద్ పాల్గొన్నారు.తాడేపల్లిగూడెం : కేంద్రంలో మోడీ అనుసరిస్తున్న రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. అఖిలపక్ష టియు, సంయుక్త కిసాన్ మోర్చా సంఘాల పిలుపులో భాగంగా మంగళవారం సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నుంచి భీమవరం వరకూ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. కార్మికులకు నష్టం కలిగించే 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా వాటిని తగ్గించడానికి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రాల్లో జరుగు ప్రదర్శనల్లో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు జవ్వాది శ్రీను, కరెడ్ల రామకృష్ణ, కర్రి సాయిరెడ్డి, అల్లు సుబ్బారావు, బంకూరు నాగేశ్వరరావు, ఎ.సత్యనారాయణ, ఎస్.శేషుబాబు, మేట్రేడ్డి రమణ, నరమాల కృష్ణ, గొర్రెల సతీష్‌కుమార్, నర్మాల నారాయణరావు, పి.రమణ, వి.శ్రీను పాల్గొన్నారు.