ప్రజాశక్తి-భీమవరం : కేరళలోని కమ్యూనిస్టు వామపక్ష ప్రభుత్వం పట్ల, ప్రజల పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కక్షసాధింపు వైఖరి తగదని సిఐటియు జిల్లా అధ్యక్షులు జె.ఎన్.వీ గోపాలన్ అన్నారు. కేరళ రాష్ట్రానికి కేంద్రం బిజెపి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతు, కార్మిక ప్రజాసంఘాలు చేస్తున్న నిరసనల్లో భాగంగా భీమవరం రంలోని ప్రకాశం చౌక్ సెంటర్లో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ కేరళలోని వామపక్ష ప్రభుత్వం విద్య, వైద్యం, స్థానిక సంస్థలకు అధికారులు, నిధులు, రైతులకు గిట్టుబాటు ధరలు, కార్మికులకు కనీస వేతనాలు, చౌక డిపోల ద్వారా ప్రజలకు 17 రకాల నిత్యవసర వస్తువులు అందిస్తు ఆదర్శవంతమైన పాలన అందిస్తుందన్నారు. అటువంటి వామపక్ష ప్రభుత్వాన్ని కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం రాజకీయ కుట్రతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తుందని విమర్శించారు. ఆ రాష్ట్రంలోని వయనాడ్ ప్రాంతంలో వరదలకు కొండ చర్యలు ఇరిగిపడి వేలాదిమంది చనిపోయారని, వేలకోట్ల రూపాయల నష్టం జరిగిందని దీనిపై ప్రపంచం అంతా స్పందించిన కేంద్ర బిజెపి ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఇలాంటి సమయంలో కేరళ ప్రజలకు, ప్రభుత్వానికి అన్ని ప్రాంతాల ప్రజలంతా సంఘీభావం తెలిపాలని కోరారు. ప్రజల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ధారపోస్తూ, ప్రజలపై బారాలు వేస్తూ రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న బిజెపి, మోడి విధానాలను ప్రజలంతా వ్యతిరేకించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడారు. రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక, కౌలురైతు సంఘాల నాయకులు బి.వాసుదేవరావు, బి. జార్జి, ఎం.ఆంజనేయులు, ఎం. వైకుంఠరావు, టి.రాము, డి.త్రిమూర్తులు, పి.మృత్యుంజయ, జి.నాగేశ్వరరావు, గోపాలకృష్ణంరాజు, బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
