ప్రజాశక్తి – మొగల్తూరు
ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తలగంపేట సత్యనారాయణ డిమాండ్ చేశారు. మొగల్తూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లు చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మధ్యకాలంలో అనేకమంది ఆశా వర్కర్లను రిటైర్మెంట్ చేశారన్నారు 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాల వరకూ వయసు పెంపుదల జిఒ రాకపోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదన్నారు. జిఒలు విడుదల చేయాలని ఈ నెల 18న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించాలని యూనియన్ రాష్ట్ర కమిటీ చేసిన నిర్ణయాన్ని తమకు తెలియజేస్తున్నామన్నారు. ప్రభుత్వం తక్షణం సమస్యల పరిష్కార ఒప్పంద జిఒలు జారీ చేయాలని కోరారు. అనంతరం పిహెచ్‌సి డాక్టర్ లక్ష్మీపార్వతికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు పి.బేబీకుమారి, బి.దేవి, కె.విజయలక్ష్మి, ఎల్.ఆశాజ్యోతి, ముచ్చలమ్మ, అశ్విని పాల్గొన్నారు.నరసాపురం : ఆశా వర్కర్ల సమస్యలపై కుటుంబ సంక్షేమశాఖ అధికారులు యూనియన్ నాయకులతో జరిపిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల జిఒలను వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు తెలగంశెట్టి సత్యనారాయణ అన్నారు. మంగళవారం లింగనబోయిన చర్ల పిహెచ్‌సి వద్ద ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ 9 నెలలు కావస్తున్నా జిఒలు విడుదల కాకపోవడంతో ఆశా వర్కర్లు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణం సమస్యల పరిష్కారానికి ఒప్పంద జిఒలు జారీ చేయాలన్నారు. అనంతరం పిహెచ్‌సి వైద్యురాలు మాధురికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పి.రత్నకుమారి, ఎం.విజయ కుమారి, బి.మణికుమారి, బి.జయలక్ష్మి, ఎన్.చిన్నారి పాల్గొన్నారు. పెనుగొండ : ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిద్ధాంతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆరోగ్య కేంద్రం పిహెచ్‌ఎన్ వెంకటలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల నాయకురాలు కంకిపాటి లక్ష్మీకుమారి మాట్లాడుతూ ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిఒ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా కేవలం తీసుకుంటున్న వేతనంత్నోఏ ఉద్యోగ విరమణ చేస్తున్న ఆశాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని జిఒ ఇవ్వాలన్నారు. ఎండనకా వాననకా కష్టపడి పనిచేస్తున్న ఆశా వర్కర్లకు కనీసం సెలవు అడిగితే ఇవ్వని పరిస్థితి ఉందని, దీనిని వ్యతిరేకిస్తూ అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.వెంకటేశ్వరరావు, ఆశా వర్కర్లు, ఆసుపత్రి ఉద్యోగులు పాల్గొన్నారు. పెనుమంట్ర:గతంలో కుటుంబ సంక్షేమ శాఖ, ఆశా వర్కర్ల మధ్య జరిగిన ఒప్పందాలను వెంటనే అమలు చేసి, ఆశాలను ఆదుకోవాలని ఆశా వర్కర్ల (సిఐటియు) యూనియన్ జిల్లా అధ్యక్షులు చింతపల్లి లక్ష్మి, ప్రధాన కార్యదర్శి దిగుబాటి జ్యోతి కోరారు. ఈ మేరకు మంగళవారం మండలంలోని మార్టేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ ఎం.మల్లికకు వినతి పత్రం అందజేశారు. ఆశా వర్కర్ల ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని, అప్పుడు జరిగిన ఒప్పందంలో అంగీకరించిన అన్ని డిమాండ్లనూ అమలు చేయాలని కోరారు. ఈ నెల 18వ తేదీన రాష్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన చేయనున్నట్లు తెలిపారు.