స్వచ్ఛమైన తాగునీరందించండి : సిపిఎం

ప్రజాశక్తి – వీరవాసరం

మండల ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరందించి ప్రజల ప్రాణాలు కాపాడాలని సిపిఎం మండల కమిటీ డిమాండ్‌ చేసింది. పార్టీ మండల కమిటీ సమావేశాన్ని కేతా జ్యోతిబసు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్‌ నాయకులు జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. తాగునీరందిస్తున్న చెరువులు కలుషితమైనా అధికారుల చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ గర్భ జలాలు కూడా కలుషితం కావడంతో ఆ నీరు తాగుతున్న కొంత మంది ప్రజలు కిడ్నీ, లివర్‌, కేన్సర్‌ వ్యాధులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎండ వేడిమి వల్ల ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూలీలకు పని ప్రాంతంలో కనీస సదుపాయాలు కల్పించకపోవడం దుర్మార్గమన్నారు. ఉపాధి హామీ కమ్యూనిస్టుల పోరాటం వల్లే వచ్చిందని, మోడీ దయవల్ల కాదని తెలిపారు. మండలంలో రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. నామమాత్రపు మరమ్మతులతో సరిపెట్టడం సరికాదన్నారు. రోడ్డు ప్రమాదాలకు అధికారులు, ప్రజా ప్రతినిధులే బాధ్యత వహించాలన్నారు. రామేశ్వరం నుంచి కవిటం వయా నవుడూరు, కొణితివాడ, మడుగుపోలవరం రోడ్డును విస్తరించకపోవడం దుర్మార్గమన్నారు. జూన్‌ మొదటి వారంలో తుపాను, అధిక వర్షాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల పట్ల పాలకులు, అధికారులు స్పందించాలని కోరారు. ఈ సమావేశంలో పోతుల మృత్యంజయ, బొర్రా ఆలమహరాజు, బాలం విజయకుమార్‌, తాళ్లూరి హరిహర రామలక్ష్మణ్‌, గొట్టుముక్కల శ్యాంబాబు పాల్గొన్నారు.

➡️