ప్రజా గొంతుక గోపీమూర్తి

ప్రజాశక్తి – భీమవరం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక, కర్షకులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఈ నేపథ్యంలో చట్టసభల్లో పిడిఎఫ్‌ ప్రాతినిధ్యం అవసరం ఎంతో ఉందని పలువురు వక్తలు అన్నారు. విద్యారంగ పరిరక్షణ, ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తున్న ప్రజా గొంతుక పిడిఎఫ్‌ ఎంఎల్‌సి అభ్యర్థి బి.గోపీమూర్తిని ఎంఎల్‌సిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో గోపీమూర్తి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ఆత్మీయ సమావేశాన్ని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పిఎస్‌ విజయరామరాజు అధ్యక్షతన బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉపాధ్యాయులుగా పని చేస్తున్న గోపీమూర్తి తన 12 ఏళ్ల సర్వీసును వదులుకొని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకుల సమస్యలు పరిష్కారానికి స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేయడం మామూలు విషయం కాదన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజలకు సేవ చేయాలనే ముఖ్యోద్దేశంతో గోపీమూర్తి తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. నిరంతరం యుటిఎఫ్‌ ఆశయ సాధనకు గోపీమూర్తి ఎంతో శ్రమిస్తున్నారన్నారు. జిల్లాలో ఉద్యమ సారధిగా ఎంఎల్‌సి షాబ్జీ ఉద్యమ వారసులుగా గోపీమూర్తి కొనసాగడం అభినందనీయమన్నారు. పిడిఎఫ్‌ ఎంఎల్‌సి వారసత్వం కొనసాగాలంటే గోపీమూర్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ శాయశక్తులా కృషి చేయాలన్నారు. ఎంఎల్‌సి అభ్యర్థి గోపీమూర్తి మాట్లాడుతూ ఉద్యమాలే ఊపిరిగా పనిచేస్తున్న నన్ను పిడిఎఫ్‌ ఎంఎల్‌సి అభ్యర్థిగా ప్రకటించడం మరింత బాధ్యత పెంచిందన్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించి ఉపాధ్యాయులను, ముఖ్య నేతలను కలుసుకున్నానని, వారి నుంచి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. ప్రజా ఉద్యమాలే ఊపిరిగా నిరంతరం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తనను ఎంఎల్‌సిగా గెలిపించి చట్టసభలకు పంపించాలని కోరారు. అనంతరం గోపీమూర్తిని, ఆయన సతీమణి క్రాంతిరేఖను మెమెంటోతో సత్కరించారు. సమావేశంలో యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎకెవి రామభద్రం, గౌరవ అధ్యక్షులు మార్కండేయులు, సహాధ్యక్షులు కె.రాజశేఖర్‌, రాష్ట్ర అసోసియేట్‌ కార్యదర్శి పద్మావతి, జిల్లా కోశాధికారి సిహెచ్‌. పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శులు శివ ప్రసాద్‌, రామకృష్ణ ప్రసాద్‌, పి.క్రాంత్‌ కుమార్‌, రత్నంరాజు, లక్ష్మీనారాయణ, ఏసుబాబు, సాయిరాం, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️