తక్కువ ధరకే నాణ్యమైన మందులు

Feb 11,2024 13:41 #West Godavari District
Quality medicines at low prices

ప్రజాశక్తి-ఉండి: రోజురోజుకి మందుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని పేదలకు నాణ్యతతో కూడిన మందులను తక్కువ ఖర్చుకి అందించేందుకు జనరిక్ మందుల షాపులు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పివిఎల్ నరసింహ రాజు అన్నారు. ఆదివారం యండగండి కో ఆపరేటివ్ రూరల్ బ్యాంక్ లో జనరిక్ మందుల షాపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా మందులు గ్రామస్తులకు అందించి జనరిక్ మందులు వాడాలని సూచించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో ఐదు చోట్ల జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు ఇప్పటికే మూడు చోట్ల ఏర్పాటు జరిగిందని మరో రెండు ప్రాంతాలలో త్వరలో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. సహకార సంఘాలు రైతు సంక్షేమంతో పాటు రైతు ఆరోగ్యానికి కూడా పెద్దపీట వేయాలని ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వ సహకారంతో జనరిక్ మందుల షాపులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మార్కెట్లో ఎక్కువ ధరకు పలికే మందులు కూడా అతి తక్కువ ధరకే నాణ్యతతో కూడిన మందులు ఇక్కడ లభ్యమవుతాయి అన్నారు. ప్రజలు వీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే మరింతగా విస్తరించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ప్రత్యేకంగా ఫార్మసిస్ట్ పర్యవేక్షణలో మందుల షాపు ఉండటం వలన రోగులకు ఇబ్బంది లేకుండా వారి రోగానికి అవసరమైన మందులు అందించేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. డిసిసిబి బ్రాంచ్ ఆధ్వర్యంలో బ్యాంకు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏటీఎం ను ఆయన ప్రారంభించారు. ఖాతాదారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. ఈ సందర్భంగా బ్యాంకు కార్యదర్శి సిహెచ్ రవికుమార్ మాట్లాడుతూ గతంలో మొబైల్ ఎటిఎం గా దీన్ని వాడే వాళ్ళమని ప్రస్తుతం రైతులకు నిరంతరం అందుబాటులో ఉంచేందుకు బ్యాంకు ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉనుదుర్రు గ్రామ సర్పంచ్ పిన్నంరాజు నాగలక్ష్మి, ఉనుదుర్రు ఎంపీటీసీ అల్లూరి మాధవి, బ్యాంకు పాలకవర్గ సభ్యులు దాట్ల కామరాజు, పైడి రామారావు ఖాతాదారులు రైతులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

➡️