ప్రజాశక్తి – పెంటపాడు
సిపిఎం నూతన మండల కన్వీనర్‌గా సిరపరుపు రంగారావు ఎన్నికయ్యారు. మండలంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం మండల మహాసభ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సిపిఎం 7వ మండల మహాసభ మండలంలోని యానాలపల్లి గ్రామం ఎస్‌సి కమ్యునిటీ హాల్‌లో మంగళవారం నిర్వహించారు. ముందుగా కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు. రైతులకు గిట్టుబాటు ధర చట్టం చేయాలి, కౌలుదారులకు గుర్తింపు కార్డులివ్వాలి, ఉపాధి హామీ చట్టానికి నిధులు కేటాయించాలని, మంచినీరు సరఫరా, రోడ్లు, డ్రెయినేజీ, దోమలు, కుక్కల సమస్యల మీద ఉద్యమించాలని, లబ్ధిదారులకు వెంటనే ఇళ్ల స్థలాలు ఇప్పించాలని, గత ప్రభుత్వం ఇచ్చిన జగనన్న పేరుతో నిర్మించిన ఇళ్లను, కొన్ని ప్రాంతాల్లో పూర్తికాని ఇళ్లను టిడిపి కూటమి ప్రభుత్వం పూర్తి చేసి పేదలకు అందించాలన్నారు. టిడిపి కూటమి చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని, విద్యుత్ భారాలు ప్రజల పైన వేయడం సరైందికాదని అన్నారు. స్మార్ట్ మీటర్లు బిగింపు మీద పెద్ద ఎత్తున ఉద్యమించాలని, నిరంతరం స్థానిక ప్రజాసమస్యలపై పోరాటాలు చేయాలని తీర్మానించారు. అనంతరం సిపిఎం నూతన మండల కన్వీనర్‌గా సిరపరుపు రంగారావు ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులు బంకురు నాగేశ్వరరావు సలపాల సత్యనారాయణ, మరపట్ల దానయ్య, అనురాధ, కుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రానున్న రోజుల్లో ఈ సమస్యల పరిష్కారానికి ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.