ఆందోళనబాటలో కార్యదర్శులు – ఎంపిడిఒలకు వినతులు
ప్రజాశక్తి – గణపవరం
గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పని ఒత్తిడి తగ్గించాలని కోరుతూ బుధవారం మండల పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎంపిడిఒ ఆర్.బేబిశ్రీలక్ష్మికి కార్యదర్శులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ గౌరవాధ్యక్షులు డిఎస్‌ఆర్.ప్రసాద్, అధ్యక్షులు ఎన్.నాగేంద్ర మాట్లాడుతూ ప్రస్తుతం 13 రకాల సర్వేలు చేస్తున్నట్లు తెలిపారు. సర్వేతోపాటు ఇంటి పన్ను, కుళాయి పన్నులు వసూలు చేయడంలో కార్యదర్శులు ఉక్కిరిబిక్కిరవుతున్నారన్నారు. ప్రభుత్వం ఇంకా 26 రకాల పనులు చేయాలని ఒత్తిడి చేయడం వల్ల విధులు నిర్వహిస్తున్న కార్యదర్శులు మానసికంగా, శారీరకంగా అలసిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. ప్రభుత్వం పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. కాళ్ల: అధిక పనిభారం, ఒత్తిడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమకు ఉపశమనం కల్పించాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు దొంగ సత్యనారాయణ కోరారు. మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఎంపిడిఒ జి.స్వాతి, ఇఒపిఆర్‌డి ఎంవి.భాస్కరరావుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శులు మాట్లాడుతూ సెలవు దినాల్లో కూడా పనులు అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల పంచాయతీ కార్యదర్శుల యూనియన్ అధ్యక్షులు దొండపాటి సునీల్‌రాజు, జిల్లా సహాయ కార్యదర్శి బళ్ల సతీష్ కుమార్, యూనియన్ జిల్లా ట్రెజరర్ సుంకర వెంకటేష్, మండల గౌరవాధ్యక్షులు తోట బాలకృష్ణ మోహన్, ఎ.పోలయ్య, ఎస్.అరుణాదేవి, బి.శ్రీనివాస్, మండల కార్యదర్శి సుజాత, జివి.రామకృష్ణంరాజు, మణికంఠ, పలువురు గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. పాలకోడేరు: తమపై పని భారాన్ని తగ్గించాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శులు ఎంపిడిఒ వి.రెడ్డియ్య, ఇఒపిఆర్‌డి రామప్రసాద్‌కు వినతి పత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ రకాల సర్వేలతో తాము సతమతమవుతున్నామని తెలిపారు. ఒకపక్క పంచాయతీల నిర్వహణ చూసుకుంటూనే, మరోపక్క పారిశుధ్య నిర్వహణ కూడా చేయడం జరుగుతుందని అన్నారు. ఇదిలా ఉండగానే సర్వేల పేరుతో నలిగిపోతున్నామని చెప్పారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో వేండ్ర, గొరగనమూడి, పాలకోడేరు, కుముదవల్లి, విస్సాకోడేరు, గరగపర్రు పంచాయతీ కార్యదర్శులు కృష్ణమోహన్, సరళ,బి.గోపీ, బాలకృష్ణ, పవన్, ప్రశాంతి పాల్గొన్నారు. ఉండి: పంచాయతీ కార్యదర్శులపై పని భారం తగ్గించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు జెవిటి.నాయుడు, కేశిరెడ్డి గోపాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. బుధవారం సాయంత్రం ఉండి మండల విస్తరణాధికారి చల్లా వెంకట సుదర్శన ్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ప్రవీణ్ కుమార్, శివాజీ, సతీష్, స్రవంతి, విజయలక్ష్మి, అప్పారావు, లక్ష్మి, కృష్ణ చైతన్య, శ్రీలత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.