వెంప, దెయ్యాలతిప్ప రోడ్లు వేయాలి

సిపిఎం ఆధ్యర్యాన ప్రదర్శన, ధర్నా

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌

వెంప, దెయ్యాలతిప్ప ఆర్‌అండ్‌బి రోడ్లను వెంటనే వేయాలని సిపిఎం మండల కన్వీనర్‌ ఇంజేటి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక సిఐటియు కార్యాలయం నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకూ సిపిఎం ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ వెంప, దెయ్యాలతిప్ప రోడ్ల మీదుగా ప్రతిరోజూ వేలాది మంది విద్యార్థులు, యువత, రైతులు, కార్మికులు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. రోడ్లన్నీ గుంతలతో నిండటంతో రాకపోకలు సాగించలేదని పరిస్థితి ఏర్పడిందని, వాహనాలు దెబ్బతినడం, అనారోగ్యం పాలవ్వడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్లు వేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. అనంతరం తహశీల్దార్‌ రాంబాబుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బొడ్డు లక్ష్మీపతి, తిరుమాని నాగేశ్వరరావు, తోటే శుభకరరావు, పొన్నమండ నాగేశ్వరరావు, ఈద భూషణం, నేతల కృపాదానం, భూపతి తిమోతి, భూపతి శామేలు తదితరులు పాల్గొన్నారు.

➡️